సీసీసీ నస్పూర్, మే 18: మహిళా సాధికారతే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలకు అప్పగించిన ప్రభుత్వ స్కూల్ యూనిఫాంలు నాణ్యతగా కుట్టాలని మంచిర్యాల అదనపు కలెక్టర్ రాహుల్ సూచించారు. మున్సిపాలిటీలో మొత్తం 17 ప్రభుత్వ పాఠశాలలో 1296 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. దుస్తులు కుట్టే బాధ్యతను శ్రీవీణ ఎస్‌హెచ్‌జీ సభ్యురాలు నిరోషకు అప్పగించారు. నస్పూర్ మున్సిపాలిటీలోని సుందరయ్యకాలనీ ఏర్పాటు చేసిన యూనిఫాం కుట్టు సెంటర్‌ను శనివారం డీఈవో యాదయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నస్పూర్ మున్సిపాలిటీలో మెప్మా ఆధ్వర్యంలో ఎస్‌హెచ్‌జీ సభ్యుల చేత దుస్తులు కుట్టిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలల ప్రారంభానికి ముందే విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఏకరూప దుస్తులను అందించాలన్నారు. మండల విద్యాశాఖ అధికారులు దుస్తుల తయారీని పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ బదావత్ రాజు, మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీశ్, మెప్మా టీఎంసీ శివరాత్రి నాగరాజు, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.
జన్నారం, మే 18 : మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య కార్యాలయంలో మహిళ శక్తి కుట్టు మిషన్ కేంద్రాన్ని స్థానిక ఎంపీడీవో శశికళ ప్రారంభించారు. మండలంలోని అన్ని పాఠశాలకు చెందిన విద్యార్థుల యూనిఫామ్స్‌ను సకాలంలో తయా రు చేసి అయా పాఠశాలకు అందించాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో రమేశ్, ఎంఈవో విజయ్‌కుమార్, ఏపీఎం బుచ్చన్న, కేంద్ర నిర్వాహకులు నాగలక్ష్మి, సునీత, సరోజన తదితరులు పాల్గొన్నారు.