కెరమెరి, జూలై 8 : ఉపాధ్యాయులు విధులను ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు హెచ్చరించారు. మంగళవారం రాత్రి కెరమెరి మండలం హట్టి ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి, క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించారు. ముందుగా తరగతి గదులను తనిఖీ చేసి, ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించారు. అనంతరం వసతి గదులు, తరగతి గదులను సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో స్వయంగా మాట్లాడి, ఉపాధ్యాయులు సరిగ్గా పాఠాలు బోధిస్తున్నారా లేదా అనే వివరాలను క్లుప్తంగా అడిగి తెలుసుకున్నారు.
బ్లాక్ బోర్డ్‌పై కొన్ని ప్రశ్నలు రాసి, విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టారు. పీవో మాట్లాడుతూ మెనూ ప్రకారం భోజనం అందించాలని, పాఠశాల వంటగదిని, స్టోర్ రూమ్‌లను శుభ్రంగా ఉండేలా దృష్టి సారించాలని తెలిపారు. నాణ్యమైన కూరగాయలు, నిత్యావసర వస్తువులు మాత్రమే వాడాలని, వంటగది పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు గైర్హాజరైనా, పాఠశాల నిర్వహణపై నిర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, పాఠశాల హెచ్ఎంలు పంచఫుల, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.