కెరమెరి, ఆగస్టు 25: పంట పొలాల్లో పెరిగిన గడ్డిని తొలగించే సరికొత్త యంత్రాన్ని తయారు చేసి ఆదర్శంగా నిలిచాడు షేక్ అయ్యూబ్. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల కేంద్రంలోని సుల్తాన్‌గూడ గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించాడు. షేక్ ఇసాక్, అక్తర్‌బీ దంపతుల మూడో కుమారుడు. తండ్రి వ్యవసాయ పనులు చేస్తుండగా, ఇద్దరు అన్నయ్యలు, మరో తమ్ముడు బైక్ మెకానిక్ షాప్ నడుపుతున్నారు. అయ్యూబ్ బైక్ మెకానిక్ పనులకు వెళ్తూనే, అప్పుడప్పుడు చేను పనులకు వెళ్లేవాడు. వారిది కష్టపడితే గాని పూటగడవని పరిస్థితి. ఎడ్లు కొనే స్థోమత లేదు. 3 ఎకరాల భూమికి ప్రతి సారి కూలీ చెల్లించాలంటే నానా కష్టాలు పడాల్సి వచ్చేది. ఎడ్ల జతతో వచ్చి కలుపు తియ్యాలి. దీనికి ఎడ్ల కిరాయితో పాటు రైతుకు ఒకరోజు కూలీ 15వందలు ఇవ్వాల్సి వస్తుంది. దీంతో ఆ యువకుడు వినూత్న ప్రయత్నం చేశాడు. ఆయనకు వచ్చిన ఆలోచనతో కలుపు తీసే యంత్రం తయారు చేశాడు. ఓ రోజు చేనులో పెట్రోల్‌తో కలుపు తీసే యంత్రాన్ని ప్రయోగాత్మకంగా ఉపయోగించాడు. ఇంకేముంది తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేయొచ్చని గుర్తించాడు. అతి తక్కువ ఖర్చుతో చేనులో పేరుకుపోయిన కలుపుని సులభంగా తొలగిస్తున్న యువకుడి మేధస్సును గ్రహించిన మండల రైతులను ఆలోచింపజేసింది. స్వయంగా ఎమ్మెల్యే ఆత్రం సక్కు చేనుకు వెళ్లి యంత్రాన్ని నడిపి చూసిన అనంతరం సదరు యువకుడిని శాలువాతో సత్కరించారు.
షేక్ అయ్యూబ్ చదివింది ఇంజినీరింగ్ కాదు. కేవలం 9వ తరగతి మాత్రమే. చదవాలని ఇష్టమున్నా, కటుంబ ఆర్థిక పరిస్థితులతో మధ్యలోనే చదువు ఆపేశాడు. బైక్ మెకానిక్ షాపులో యంత్రాల పనితీరు గ్రహించాడు. చేనులో కలుపు తీసే యంత్రాన్ని తయారు చేసి వ్యవసాయం అభివృద్ధి చేయాలని ఆలోచించాడు. ఆయన ఆలోచనకు తోడు అన్నయ్యలు సహకారం అందించారు. దీంతో లీటరు పెట్రోల్‌తో ఎకరం భూమిలో కలుపు తీసే యంత్రాన్ని సిద్ధం చేశాడు. ఒక్క రైతు రోజుకు రూ.1500 తీసుకొని ఎకరం చేనులో ఉన్న కలుపు మాత్రమే తొలగిస్తే, ఈ యంత్రం ద్వారా లీటరు పెట్రోల్‌తో ఎకరం కలుపును ఒక గంట వ్యవధిలో తీస్తున్నాడు.
నాన్న కష్టాన్ని చూసి పంట చేనులో కలుపు తీసే యంత్రాన్ని తయారు చేశా. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. అప్పుడప్పుడు నేను కూడా చేనుకు వెళ్లి పనులు చేస్తుండేవాడ్ని. మాకున్న మూడెకరాల భూమిలో కలుపు తీయాలంటే మూడు రోజులు పట్టేది. దీనికి రూ. 4,500 అయ్యేది. అందుకే యంత్రం తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. ఆటో, బైక్ పరికరాలను జోడించి పెట్రోల్‌తో నడిచే కలుపు తీసే యంత్రాన్ని తయారు చేశా. రూ. 35వేలు ఇందుకోసం ఖర్చు చేశా. దీంతో ఓ రైతు 3 రోజులు చేసే పనిని యంత్రం ద్వారా 2 నుంచి 3 గంటల్లోపు పూర్తి చేస్తున్నా. ఖర్చు కూడా పూర్తిగా తగ్గింది. కేవలం 2 నుంచి 3 లీటర్ల పెట్రోల్ పోస్తే సరిపోద్ది. ప్రభుత్వం సహకరిస్తే ఇలాంటి యంత్రాలను తయారు చేసి రూ. 40వేలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న.
-షేక్ అయ్యూబ్, సుల్తాన్‌గూడ(కెరమెరి).