మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 14 : భూతగాదా కేసులో పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీనివాస్ అలియాస్ శ్రీనును అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు మంచిర్యాల ఏసీపీ రత్నపురం ప్రకాశ్ తెలిపారు. ఏసీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్ మండలం రసూల్‌పల్లికి చెందిన కోమటి సత్తయ్య, మంచిర్యాలలోని హమాలీవాడకు చెందిన సోంశెట్టి సంపత్తో కలిసి సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామానికి చెందిన పోతిరెడ్డి సుధాకర్ రెడ్డి 10 ఏళ్ల క్రితం గర్మిళ్ల శివారులోని సర్వే నంబర్ 180/1లో తలో వెయ్యి గజాల చొప్పున స్థలం కొనుగోలు చేశారు. చుట్టూ సిమెంట్ ప్లేట్ ఫెన్సింగ్ వేసుకున్నారు. గత నెలలో కుంట శ్రీనివాస్ సిమెంట్ ప్లేట్లను ధ్వంసం చేసి ముగ్గురికి సంబంధించిన స్థలాన్ని ఆక్రమించుకున్నాడు.
ఆ ముగ్గురూ మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీనివాస్‌పై మూడు కేసులు నమోదు చేశారు. అయినా తన పద్ధతి మార్చుకోలేదు. వారం క్రితం భూమి ఆక్రమించుకునేందుకు భూమిని కొలిచాడు. ఆ ముగ్గురిలో సుధాకర్ రెడ్డి పలుకుబడిన వ్యక్తిగా ఉండడంతో అతని అడ్డు తొలగిస్తే మిగతా ఇద్దరిని బెదిరించి, స్థలాన్ని కబ్జా చేసుకోవచ్చనే ప్లాన్ చేసుకున్నాడు. ఈ క్రమంలో 10వ తేదీన ముగ్గురూ స్థలం వద్దకు వెళ్లారు. విషయం తెలుసుకున్న శ్రీనివాస్ తల్వార్‌తో సుధాకర్‌రెడ్డిపై దాడి చేశాడు. దీంతో ముగ్గురూ పారిపోయారు.
అదే రోజు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం కుంట శ్రీను మంచిర్యాల అమరావది ఏరియాలో ఉన్నాడన్న సమాచారం మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని విచారించగా 2013లో గర్మిళ్ల శివారులో ఎకరం భూమి కొనుగోలు చేసినట్లు, అక్కడ భూమి విలువ పెరగడంతో తన పక్కన ఉన్న సుధాకర్ రెడ్డి భూమి కబ్జా చేయాలనే ఉద్దేశంతో వారిపై దాడి చేసినట్లు ఒప్పుకున్నాడు. శ్రీనివాస్ గతంలో గట్టు వామన్‌రావు దంపతులను హత్య చేసిన ఘటనలో ఏ1 నిందుతుడిగా ఉన్నట్లు, ఇతనిపై ఇప్పటి వరకు 5 కేసులు నమోదైనట్లు ఏసీపీ వెల్లడించారు. ఈ మేరకు శ్రీనివాస్ వద్ద నుంచి తల్వార్‌ను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పా రు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ బన్సీలాల్, ఎస్ఐ సురేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
దాడికి పాల్పడిన వారిపై..
జిల్లా కేంద్రంలోని అశోక్ రోడ్డులో దుర్గాదేవి శోభాయాత్రలో ఓ కుటుంబంపై దాడికి పాల్పడిన అబ్దుల్ అఫ్రోజ్, బిట్టు, రాజుతో పాటు, మరికొందరిపై కేసు నమోదు చేససినట్లు సీఐ బనీసలాల్ తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో డీజే సౌండ్‌తో వెళ్తున్న వాహనాన్ని చింతపండు రాజేశం ఇంటి ఎదుట నిలుపగా, సౌండ్ ఎక్కువ రావడంతో అతని కొడుకు శిరీశ్ బయటకు వచ్చి, వవాహనాన్ని ముందుకు తీసుళ్లాలని కోరారు. ఆగ్రహానికి గురైన ఆ యువకులు శిరీశ్పై దాడి చేశారు. అడ్డుకోబోయిన తల్లి తండ్రులు, స్నే హితులపై దాడికిదిగారు. సోమవారం మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, కేసు నమోదుచేసినట్లు సీఐ తెలిపారు.
ఇరువర్గాలపై కేసు..
దండేపల్లి, అక్టోబర్ 14 : దండేపల్లి మండలం గూడెంలో దసరా పండుగ రోజు ఇరు వర్గాలు దాడి చేసుకోగా, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఉదయ్‌కిరణ్ తెలిపారు. ఇరువర్గాలకు చెందిన ఏడుగురితో పాటు, మరికొందరిపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ఆదివారం ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామన్నారు.
గోలేటిలోముగ్గురిపై..
రెబ్బెన, అక్టోబర్ 14 : రెబ్బెన మండలం గోలేటిలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్‌పై దాడిచేసిన ముగ్గుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం రాత్రి ఉపేందర్ ఇంటికి వెళ్లి న ముగ్గురు.. బయటకు రావాలని కోరారు. రాకపోవడంతో ఆయనపై దాడిచేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
నెన్నెలలో ఇద్దరిపై..
నెన్నెల, అక్టోబర్ 14 : కల్లు తాగి వాంతి చేసుకున్న గోల్లపల్లి గ్రామానికి చెందిన పొన్నాల వెంకటస్వామిపై కులంపేరుతో తిట్టి, దాడిచేసిన అదే గ్రామానికి చెందిన వేల్పుల రాజం, అతని కొడుకు సురేశ్‌పై కేసు నమోదు చేసినటుల ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. వెంకటస్వామి సోమవారం ఉదయం ఈత కల్లు తాగి వచ్చి, గ్రామంలోని చింతచెట్టు కింద కూర్చున్నాడు. అక్కడే వాంతిచేసుకున్నాడు. గమనించిన రాజం.. తన భూమిలో వాంతి చేసుకుంటావా అంటూ ముఖంపై ఉమమేమసి, కులం పేరుతో తిట్టాడు. కర్రతో దాడిచేశాడు. తప్పించుకున్న వెంకటస్వామి విషయాన్ని కుటుంబ సభ్యులు, కుల పెద్దలకు చెప్పాడు. వారు సంఘటనా స్థలానికి రాగా, వారిపైనా రాజం, తన కొడుకు సురేశ్ తిట్టారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
కాగజ్‌నగర్‌లో 14 మంది రిమాండ్..
కాగజ్‌నగర్, అక్టోబర్ 14 : కాగజ్‌నగర్‌లోని ఈఎస్ఐ వాటర్ ట్యాంక్ సమీంలో, ప్రధా మారెట్ ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలోని జ్యూస్ సెంటర్ వద్ద జరిగిన గొడవలో 14 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ రామానుజం వెల్లడించారు. మరికొందరిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. పట్టణ ప్రజల శ్రేయస్సు కోసం, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారని, సమస్యలు, గొడవలు చెలరేగినా ముందుగ పోలీసులకు సమాచారం అందజేయాలన్నారు.