ఇంద్రవెల్లి : పదో తరగతి విద్యార్థులు కష్టపడి మంచి మార్కులు సాధించి ఆదర్శంగా నిలువాలని కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) సూచించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ( IndravellI) మండలంలోని కేజీబీవీ పాఠశాలను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ( Special Classes) నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Exam Centre Visit Adb Colle
విద్యార్థులకు మెరుగైన వైద్యంతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. వండుతున్న వంటను పరిశీలించి రుచులు చూశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్యాశిబిరాన్ని ఆయన సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్య విషయాలపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని సూచించారు. పాఠశాలకు కంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలని విద్యార్థులు కలెక్టర్‌ను కోరారు.
స్పందించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాఠశాలకు చెందిన స్థలాన్ని కొలతలు తీసుకుని ప్రత్యేక హద్దులు ఏర్పాటు చేయాలని అందుబాటులో ఉన్న రెవెన్యూ శాఖ అధికారులకు సూచించారు. అనంతరం మండలకేంద్రంలోని క్రిసెంట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో భాస్కర్, గిర్దావర్ మెస్రం లక్ష్మణ్, అధికారులు, తదితరులు ఉన్నారు.