ఎదులాపురం, జూన్18 : ప్రయాణికుల ధన, మాన, ప్రాణాలు, భద్రతే ముఖ్యమని, ఇందులో భాగంగా జిల్లాలో మొదటిసారిగా ‘అభయ మై టాక్సీ ఈస్ సేఫ్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్తో కలిసి క్యూఆర్ కోడ్లను ఆవిష్కరించి 300 ఆటోలకు అంటించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఓ హత్యకు సంబంధించిన నిందితుడు ఆటోలో పారిపోయాడని, కానీ ఆటోకు నంబర్ లేకపోవడంతో కనుకోవడం కష్టంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 3,232 ఆటోలకు పోలీసు శాఖ తరఫున నంబర్లతో పాటు క్యూఆర్ కోడ్ సానర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఆటో ఎకిన వెంటనే క్యూఆర్ కోడ్ సాన్ చేస్తే, ఆటో వివరాలతో పాటు యజమాని వివరాలు తెలుస్తాయన్నారు.
ఆటోలో అనుమానితులు ఎక్కినా, కిడ్నాప్ లాంటివి జరిగినా వెంటనే 100 నంబర్ ఫోన్ చేసి సమాచారం అందించాలని డ్రైవర్లకు సూచించారు. ఆటో యజమనులు ‘అభయ మై ట్యాక్సీ ఈస్ సేఫ్’ కింద రూ.350 చెల్లిస్తే సంవత్సరం పాటు రూ.లక్ష బీమా వర్తిస్తుందన్నారు. అనంతరం ఆటోకు ‘అభయ మై టాక్సీ ఈస్ సేఫ్ పోస్టర్ను ఆటోకు అతికించి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రణయ్ కుమార్, సీఐలు బీ సునీల్ కుమార్, సీహెచ్ కరుణాకర్ రావు, ఎస్ఐలు ముజాహిద్, అశోక్, మహేందర్, దేవేందర్, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.