కౌటాల, ఆగస్టు 19 ః కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల పరిసరాల్లో రెండు రోజులుగా పులి సంచరిస్తున్నది. మంగళవారం మధ్యాహ్నం ముత్తంపేట, శిర్షా గ్రామాల సరిహద్దు నుంచి కౌటాల కంకలమ్మ గుట్ట అటవీ ప్రాంతంలోకి వచ్చింది. అయితే బుధవారం తెల్లవారు జామున మండల కేంద్రంలోని అటవీ నర్సరీ ప్రాంతం, జడ్పీ పాఠశాల వెనుక, పల్లె ప్రకృతి వనం పరిసరాల్లో సంచరించినట్లు అటవీ అధికారులు, యానిమల్ ట్రాకర్లు గుర్తించారు.
కాగ బుధవారం కౌటాల అటవీ ప్రాంతం, తాటిపల్లి రోడ్డులోని వ్యవసాయ పత్తి చేనులో పులి అడుగుజాడలను స్థానికులు అటవీ అధికారులు గుర్తించారు. వ్యవసాయ భూముల నుండి తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు స్థానిక రైతులు తెలిపారు. రైతులు, పశువుల కాపరులు అడవికి వెళ్లకూడదని కౌటాల ఎఫ్ఎస్వో తులసీదాస్ నాయక్, ఎఫ్బీవో టేకం శ్రీదేవి తెలిపారు.