ఖానాపూర్, జూలై 7 : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీ సమీపంలోని పొలాల్లో మంగళవారం అరుదైన శ్వేతనాగు(తెల్లటి నాగుపాము) దర్శనమివ్వడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. శ్రీరాంనగర్ కాలనీకి చెందిన ఆసూరి సంతోష్, రవిలు పొలాలను పరిశీలించి తిరిగి వస్తుండగా, రోడ్డుకు ఆనుకుని ఉన్న ఓ పొలంలో సుమారు ఆరు అడుగుల పొడవు ఉన్న తెల్లటి నాగుపాము కనిపించింది.
దీంతో వారు అప్రమత్తమై దూరం నుంచి పామును గమనించారు. కొద్దిసేపట్లోనే ఈ విషయం చుట్టు పక్కల వారికి తెలియడంతో పలువురు స్థానికులు అకడికి చేరుకొని దూరం నుంచే పామును వీక్షించారు. అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో అప్పుడప్పుడు నాగుపాములు కనిపించినప్పటికీ, పూర్తిగా తెల్లటి వర్ణంలో ఉండే శ్వేత నాగు దర్శనం అత్యంత అరుదని స్థానికులు పేరొన్నారు.