ఎదులాపురం, ఏప్రిల్ 4: ఆదిలాబాద్ జిల్లాలో త్వరలో ‘పోలీసు మీ కోసం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రతివారం ఒకో గ్రామంలో నిర్వహిస్తామని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శుక్రవారం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉట్నూర్ సబ్ డివిజనల్ పోలీసు అధికారులతో నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పెండింగ్ కేసులపై ఆరా తీశారు. కేసుల్లో నిజాయితీగా బాధితులకు న్యాయం చేకూరే విధంగా దర్యాప్తు పూర్తి చేసి కోర్టులలో చార్జి షీటు దాఖలు చేయాలని తెలిపారు.
ముఖ్యంగా పోక్సో కేసుల్లో నిర్ణీత సమయంలో దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని తెలిపారు. నూతన సైబర్ క్రైమ్‌లపై, నూతన చట్టాలపై, అసాంఘిక కార్యకలాపాలపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. దాబాల్లో అసాంఘిక కార్యకలాపాల నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. హైవేలపై ప్రమాదాల నివారణకు కృషి చేయలన్నారు. గంజాయి సాగు, స్మగ్లింగ్, వినియోగించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు.
కోర్టు డ్యూటీ అధికారి విధులను పర్యవేక్షిస్తూ పెండింగ్‌లో ఉన్న కేసుల్లో సాక్షులను హాజరు పరిచి, నేరస్తులకు శిక్షలు పడే విధంగా కృషిచేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా వీడీసీలు ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు (బెల్ట్ షాపులు, కళ్లు దుకాణాలు) అనుమతులివ్వకుండా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా, అక్రమ వసూళ్లకు పాల్పడకుండా చూడాలన్నారు.
పట్టణంలో ప్రత్యేకంగా నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటుచేసి నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. రాత్రి సమయాల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తుల వేలిముద్రలను సేకరించి ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. ఈ సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ ఐపీఎస్, డీఎస్పీలు సీహెచ్ నాగేందర్, పోతారం శ్రీనివాస్, సీఐలు భీమేశ్, మొగిలి,రహీం పాషా,పాండే రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.