మామడ, అక్టోబర్ 26 : మామడ మండలంలోని కొరిటికల్ గ్రామంలో రైతులు గతేడాది పంట ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలోని 300 మందికి పైగా రైతులు ఒక్కొక్కరు మూలధనంగా రూ. 6500 సమకూర్చరు. సుమారు రూ. 20 లక్షలతో ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల దుకాణం ఏర్పాటు చేసి వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరి టర్నోవర్ రూ.27 లక్షలకు చేరుకుంది. బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వీరికి లభిస్తుండడంతో వ్యయం ఆదా అవుతోంది. యాసంగిలో రైతులు జొన్న, సజ్జ, ఆవాలు,మొక్కజొన్న వంటి పంటలను ఎక్కువగా సాగు చేశారు. పసుపు పంటను ఈ ప్రాంతంలోని రైతులు సాగు చేస్తున్నారు.
కొత్త వంగడాల సాగు
రైతు సేవా కేంద్రం ఆధ్వర్యంలో గ్రామంలో ఎరువుల దుకాణం నిర్వహణతో పాటు పంటల సాగులో కొత్త వంగడాలను వాడుతూ దిగుబడులను ఆశిస్తున్నారు. పసుపు సాగులో వయాగాన్ అనే కొత్త రకం విత్తనాన్ని 20 ఎకరాల్లో సాగు చేశారు. ఈ పసుపులో కర్కుమిన్ శాతం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు సూచించడంతో ఇతర ప్రాంతాల నుంచి పసుపు విత్తనాన్ని తెచ్చి సాగు చేస్తున్నారు.
రైతులకు ప్రోత్సాహం
గ్రామంలోని పంట ఉత్పత్తిదారుల సంఘాన్ని గుర్తించిన అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ రైతులకు సా గులో మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. పంటల సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీఈవో సుమన్ కుమార్ తెలిపారు. స్ఫైసీ పసుపు బోర్డు ఆధ్వర్యంలో రైతులకు పసుపు పంట నాణ్యతపై గ్రామంలోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రైతు సేవా సంఘం సభ్యులకు పసుపు ఉడికించే యంత్రాలను సబ్సిడీపై అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రైతులు వ్యవసాయ సాగులో సాంకేతికతను జోడించి అధిక దిగుబడులను సాధిస్తున్నారు.
అవగాహన కల్పిస్తున్నరు..
గ్రామంలోని రైతులందరం కలిసి రైతు సేవా కేంద్రం ఏర్పాటు చేసుకున్నాం. ఎరువులు, విత్తనాలు నేరుగా కంపెనీ నుంచి తెచ్చుకోవడంతో మాకు ప్రయోజనం కలుగుతున్నది. శాస్త్రవేత్తల సలహాలు కచ్చితంగా పాటిస్తున్నాం.
-ఎలూరి రమేశ్‌రెడ్డి, రైతు కొరిటికల్
కొత్త వంగడాలతో సాగు
సాగులో వినూత్నంగా కొత్త వంగడాలను వినియోగిస్తు న్నాం. పసుపు పంటలో వయగాన్ వంగడం ఈ యే డాది సాగు చేశాం. అరణ్య శాశ్వత స్వచ్ఛంద వ్యవసా య సంస్థ, స్పైసీ బోర్డు సభ్యులు సాగు విధానం పై అవగహన కల్పిస్తున్నారు. అధిక దిగుబడికి కావాల్సిన సలహాలు, సూచనలు అందిస్తున్నారు.
-భీంరెడ్డి, రైతు సేవా సంఘం అధ్యక్షుడు, కొరిటికల్