వాంకిడి, ఫిబ్రవరి 24: మహారాష్ట్ర వాసి ఒకరు మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం వాంకిడి మండల పరిధిలో చోటుచేసుకుంది. వాంకిడి ఎస్ఐ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా జీవితి తాలుకా హెరెవా గ్రామ వాసి హొడెబె సుదాం (33) అనే వ్యక్తికి భార్య సావిత్రిబాయితో పాటు ఇద్దరు ఆడ పిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే సుదాం.. పత్తి తీత పని కోసం వాంకిడి మండల ప్రాంతంలోనే కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఈ ప్రాంతంలోనే కూలీకి వెళుతున్నా హొడెబె కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో కూలీకి వెళ్లి సంపాదించిన మొత్తం డబ్బులను మద్యానికే ఖర్చు పెట్టేవాడు.
ఆదివారం భార్యతో కలిసి అత్తగారిల్లు హిరాపూర్కు వెళ్లాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సుదాం.. కూలీ డబ్బులు తన వద్దే ఉండటంతో సోమవారం తన ద్విచక్రవాహనంపై వాంకిడి మండల కేంద్రానికి వచ్చాడు. స్థానిక ఫర్టిలైజర్ దుకాణంలో పురుగుల మందు కొనుగోలు చేసి అర్లీ గ్రామ శివారులోని పత్తి తోటలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్పృహ తప్పి పడిపోయి ఉండటాన్ని గమనించిన కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం అందజేశారు. మృతుడి అన్న హొడెబె సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రశాంత్ తెలిపారు.