ఎదులాపురం, సెప్టెంబర్ 26: లాటరీ తగిలిందంటూ సైబర్ మోసగాళ్ల వలలో స్పిన్నింగ్ మిల్ కార్మికుడు చిక్కి మోసపోయిన ఘటన శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలో జరిగింది. ఇచ్చోడ మండ లం సిరిచెల్మకు చెందిన మంగళగిరి రాజేందర్ 9 ఏళ్లుగా ఆదిలాబాద్ రణదీవెనగర్‌లో అద్దె ఇంట్లో భార్య కృష్ణవేణి, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. ఇతను స్పిన్నింగ్‌మిల్లులో మిషన్ ఆపరేటర్ కాగా భార్య బట్టల దుకాణంలో పనిచేస్తున్నది.
ఈ నెల 22 న ఉదయం రాజేందర్‌కు జితేందర్ చౌహాన్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. ‘మీ పేరుపై కేరళ లాటరీ వచ్చిందని, మీ బ్యాంకు ఖాతాలో రూ. 5 లక్షలు జమయ్యాయని జీఎస్టీ చెల్లించకుంటే కేసు నమోదు చేస్తాం’ అని భయపెట్టారు. తన అకౌంట్లో ఎలాంటి డబ్బు జమకాలేదని రాజేందర్ చెప్పాడు. రూ. 5000 జీఎస్టీ చెల్లించిన తర్వాత డబ్బు తీసుకోవచ్చన్నారు.
రాజేందర్ సైబర్ నేరగాడు చెప్పిన బ్యాంకు అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేయించాడు. ఆ తర్వాత సైబర్ నేరగాడు ఈ నెల 23న ఫోన్ చేసి భయపెట్టాడు. రాజేందర్ భార్య బంగారు కమ్మలు, ఉంగరం విక్రయించి రూ.51,400 పంపించాడు. మొత్తం 56, 400 వరకు సైబర్ కేటుగాళ్లకు పంపించినప్పటికీ ఖాతాలో లాటరీ డబ్బులు జమకాకపోవడంతో భార్యకు చెప్పి బాధపడ్డాడు. సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు రాజేందర్ చెప్పాడు.