మారుమూల గిరిజన గూడేలకు సరైన రోడ్డు లేక అంబులెన్స్ రాని పరిస్థితి నెలకొన్నది. దీంతో ఆదివాసీలు అత్యవసర పరిస్థితుల్లో అవస్థలు పడుతున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం మండలంలోని పెసర్‌కుంట గ్రామపంచాయతీ పరిధిలోని మురళిగూడకు చెందిన కుమ్రం వనితకు ఆదివారం పురిటి నొప్పులు రాడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. గ్రామానికి వచ్చే దారిలో డోరుమల్లి వాగు దాటి అంబులెన్స్ రాలేకపోయింది.
దీంతో పురిటినొప్పులతో అవస్థలు పడుతున్న గర్భిణిని గుంతల రోడ్డు మీదుగా ఎడ్లబండిపై కిలోమీటర్ దూరంలోని వాగు దాటించి అంబులెన్స్ ఎక్కించారు. వనితను దహెగాంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకురాగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామానికి మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
– దహెగాం, నవంబర్ 16