జై నూర్ : ఆదివాసీల ఆత్మబంధువులు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ జెట్టి ఎలిజిబెత్ దంపతులని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గొడం నగేష్( MP Nagesh) అన్నారు. ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ , జెట్టి ఎలిజిబెత్ ( Hyman Dorf and Elizabeth ) దంపతుల 39వ వర్ధంతి సందర్భంగా జిల్లాలోని జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో వర్ధంతిని నిర్వహించి వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి ( Tribute ) అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైమన్ డార్ఫ్ జెట్టి ఎలిజిబెత్ దంపతులు నివసించిన మార్లవాయి ఎంతో చారిత్రాత్మక ప్రాంతమని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ప్రాంత యువకులు సద్వినియోగం చేసుకొని విద్య, ఉద్యోగ రంగాలలో రాణించాలని తెలిపారు. ఎలాంటి సౌకర్యాలు లేని రోజులలో ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ జెట్టి ఎలిజిబెత్ దంపతులు ఈ ప్రాంతంలో పర్యటించి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై నివేదిక తయారుచేసి ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకున్నారని కొనియాడారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ జెట్టి ఎలిజిబెత్ దంపతులు స్వాతంత్రం రాకముందే ఈ ప్రాంతంలో పర్యటించి గిరిజనులతో మమేకమై ఆదివాసీల చైతన్యం కోసం కృషి చేశారని, హైమన్ మానవ పరిణామ పర్యావరణవేత్త, గొప్ప శాస్త్రవేత్త అని తెలిపారు. ప్రభుత్వం హైమన్ డార్ఫ్ జెట్టి ఎలిజిబెత్ దంపతుల పేరిట స్మృతి వనం ఏర్పాటుకు నిధులు మంజూరు చేసిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎస్పీ నితికా పంత్, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థచ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్, ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు మాట్లాడారు.
జైనూర్, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్లు విశ్వనాధ్, ఇరుకుల్ల మంగ, డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాం నాయక్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, మార్లవాయి సర్పంచ్ కనక ప్రభావతి, రాజ్ గోండ్ సేవా సమితి ప్రతినిధి సిడాం అర్జు, రాయి సెంటర్ జిల్లా మేడి కుర్సింగ మోతిరామ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.