ఇంద్రవెల్లి, మే 10 : బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మండల యూత్ సభ్యులు, కుల సంఘాల నాయకులు, ప్రజలు, వ్యాపారస్తులు ర్యాలీ తీశారు. ఆర్మీ జవాన్ చిత్రపటానికి ఫూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ తల్లి చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు వెలిగించిన కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మారుతి పటేల్ డోంగ్రే, ఏఎంసీ చైర్మన్ ముకాడే ఉత్తమ్, మాజీ ఎంపీపీ కనక తుకారాం, బీజేపీ మండలాధ్యక్షులు కేంద్రే బాలాజీ, మాజీ మండలాధ్యక్షులు ఆరేల్లి రాజలింగు, నాయకులు పాల్గొన్నారు.
సారంగాపూర్, మే 10 : రాంసింగ్తాండకు చెందిన ఉపాధి హామీ కూలీలు శనివారం అమరవీరుడు వీర జవాన్ మురళీ నాయక్‌కు నివాళులు అర్పించారు. కూలీలు జోహార్, జోహర్ మురళినాయక్ అంటు నినాదాలు చేశారు. ఇందులో ఉపాధి కూలీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ముథోల్, మే 10 : ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని కోరుతూ ఆష్టా గ్రామంలో విద్యార్థులు, గ్రామపెద్దలు, యువకులు భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతోపాటు పహల్గాంలో మృతి చెందిన వారితోపాటు యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పించారు.
బాసర, మే 10 : దేశంలో నెలకొన్న యుద్ధ వాతావరణం సందర్భంగా శనివారం బాసర సరస్వతీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన వైదిక బృందం ప్రత్యేక సంకల్పం చెప్పి అమ్మవారి మూలవిరాట్‌కి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం అభిషేక అనంతరం అర్చన సమయంలో సామూహికంగా భక్తులందరి చేత దేశప్రజల రక్షణ, రక్షణశాఖకు అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం లభించాలని శత్రుదేశం యొక్క దుర్భుద్ధి నాశనం కావాలని, దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న త్రివిధ దళాధిపతులకు ఆత్మైస్థెర్యం, బహుబుద్ధి బలం, మనోధైర్యం అమ్మవారు కల్పించాలని భక్తులతో విశేశ సంకల్పం చేయించారు.
తాంసి, మే 10 : కప్పర్ల గ్రామంలోని రామాల యంలో శనివారం ఐదుసార్లు సామూహిక హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం, రామరక్ష స్తోత్రం పఠించారు. పహాల్గాంలో ఉగ్రవాదులు దాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యం లో సంఘీభావంగా వేద పండితులు విశాల్ శర్మ సమక్షంలో చాలీసా పఠించి సంఘీభావం తెలిపారు.
కుభీర్, మే 10 : మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకుని కుభీర్ మండలం ఉండడంతో పాకిస్తాన్‌కు చెందిన వారు చొరబడే అవకాశం ఉన్నందున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిగ్వ, డోడర్న, సిర్పెల్లి తండా, బెల్గాం మార్లగొండ గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు కనిపిస్తే ఆధార్ కార్డు చూపించమని అడగాలని, లేని పక్షంలో పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు.