తాండూర్, ఫిబ్రవరి 10 : బెల్లంపల్లి రేంజ్ పరిధిలో దాదాపు 12 రోజుల పాటు సంచరించిన పెద్దపులి ఆదివారం రాత్రి మాదారం అడవుల్లోకి ప్రవేశించినట్లు అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి తిరుపతి, బీట్ ఆఫీసర్ సీహెచ్ భాసర్ తెలిపారు. ఆదివారం బుగ్గ రాజరాజేశ్వరాలయం సమీపంలోని కొండపోచమ్మ గుడి పక నుంచి అంకుశం గుట్టల మీదుగా తాండూర్ మండలం మాదారం ప్రాంతంలోని గొంతెమ్మ గుట్టల ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు తెలియడంతో సోమవారం ఉదయం గొంతెమ్మ గుట్ట ప్రాంతంలో పెద్దపులి పాద ముద్రలు గుర్తించామన్నారు.
తిరిగి సోమవారం సాయంత్రం తాండూర్ మండల సరిహద్దు దాటి రెబ్బెన మండలం పులికుంట అటవీ ప్రాంతంలో ప్ర వేశించినట్లు పాద ముద్రలు గుర్తించినట్లు తెలిపారు. వేటగాళ్ల నుం చి పులిని రక్షించేందుకు యానిమల్ ట్రాకింగ్ టీంతో పర్యవేక్షిస్తున్నామన్నారు. మాదారం, పులికుంట సమీప గ్రామాల్లోని పశువు ల కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తక్కలపల్లిలో అవగాహన
రెబ్బెన, ఫిబ్రవరి 10: పులి సంచారంపై రెబ్బెన రేంజ్ అధికారి నిజాముద్దీన్, డిప్యూటీ రేంజ్ అధికారి భానేశ్ ఆదేశం మేరకు రెబ్బెన తక్కలపల్లి, పులికుంట, రోళ్లపహాడ్, రాజారం, కొత్తగూడతో పాటు పలు గ్రామాల్లో బీట్ అధికారులు ఉషారాణి, శ్రీలత అవగాహన కల్పించారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల సరిహద్దు వద్ద నిర్మించిన ఏకో బ్రిడ్జి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా ఉంచినట్లు తెలిపారు. మాదారం వైపు నుంచి రెబ్బెన వైపు పులి వచ్చే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పులికి ఎలాంటి హాని కలిగించవద్దని సూచించారు.