హాజీపూర్, మార్చి 15 : జిల్లాలోని 306 (ఇటీవల ఐదు జీపీలు కార్పొరేషన్లో కలిశాయి) గ్రామ పంచాయతీల్లో వందశాతం ఆస్తి పన్నులు వసూలు చేసేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా రూ.6.82 కోట్లు టార్గెట్ కాగా, రూ. 6.20 కోట్లు వసూలు చేయడంతో 90 శాతం పూర్తయ్యింది. ఇక 16 రోజులే మిగిలి ఉండగా, మిగతా 10 శాతం వసూలు చేసేందుకు అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. మార్చి నెలాఖారులోగా వంద శాతం వసూలు చేయాలని ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలిచ్చినట్లు జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు తెలిపారు.
పల్లెల్లో ప్రత్యేక పాలన
సర్పంచుల పదవీకాలం ఇటీవల పూర్తికాగా, ప్రత్యేకాధికారుల పాలన సాగుతున్నది. నిధులు లేక పల్లెల్లో అభివృద్ధికుంటు పడింది. దీంతో నిధులు సమకూర్చుకునేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే వందశాతం ఆస్తిపన్ను వసూళ్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
బకాయిలే లేకుండా
త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే అవకాశముండగా, సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీలో ఉండేవారంతా తమ ఆస్తి పన్నులు చెల్లిస్తున్నారు. ఆస్తి పన్నుతో పాటు వార సంత, కమర్షియల్ లైసెన్స్లు, ఇండ్ల నిర్మాణ అనుమతుల పన్నులను ప్రణాళికాబద్ధంగా వసూలు చేస్తున్నారు.
అదనపు పని భారం
గ్రామ పంచాయతీ కార్యదర్శులు పనిభారంతో సతమతమవుతున్నట్లు చెబుతుండగా, తాజాగా పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలంటూ ఆదేశాలు రావడంతో తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే పారిశుధ్య పనుల నిర్వహణతో పాటు ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ, కాంపోస్టు షెడ్లు, నర్సరీల నిర్వహణ, డీఎస్ఆర్, యాప్ అప్లోడ్లతో బిజీగా ఉంటుండగా, ఇప్పుడు ఆస్తి పనులు 100 శాతం వసూలు చేయాలని ఆదేశాలు రావడంతో వారిపై మరింత ఒత్తిడి పడుతున్నది.
100 శాతం వసూలు చేస్తాం..
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో వంద శాతం ఆస్తి పన్నులు వసూలు చేయాలని కార్యదర్శులకు ఇప్పటికే సూచించాం. ఇప్పటి వరకు 90 శాతం ఆస్తి పన్నులు వసూలు చేశాం. లక్ష్యంలోగా మిగతా 10 శాతం వసూలు చేస్తాం..
– వెంకటేశ్వర్ రావు, జిల్లా పంచాయతీ అధికారి