జన్నారం, జూలై 29 : కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 70 రకాల సీతాకోక చిలుకల సందడి చేస్తుండగా, అధికారులు వాటి సంతానోత్పత్తి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఇటీవల జన్నారం మండల కేంద్రంలోని అటవీశాఖ నర్సరీలో సీతాకోక చిలుకల ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు.
ఇందులో నాటిన తెలుకొండి, చిట్టిగిలిగిచ్చా, జంట్రోప, శంకు పుష్పం,లంటానా, రామబాణం, గడ్డిచామంతివంటి పూల మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరిగాయి. జాకర్, కెమ్సన్, డనైడ్ఎగ్ప్లే, సిగ్రిడ్స్, తరక్సానారవంటి సీతాకోక చిలుకలు పూలపై వాలి మకరంద్రాన్ని జురుతున్నాయి. మున్ముందు మరిన్ని జాతులు ఇక్కడికి వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. సీతాకోక చిలుకల సంతానోత్పత్తికోసం కావాల్సిన మొక్కలు పెంచినట్లు వారు తెలిపారు.
జీవ వైవిధ్యంలో కీలకం
ప్రకృతికే కొత్త అందాల్ని తీసుకొచ్చే ఈ సీతాకోక చిలుకలు జీవివైవిధ్యం లోనూ కీలకంగా వ్యవహరిస్తాయి. వాటి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. కవ్వాల్ అడవుల్లో 70 రకాల సీతాకోక చిలుకల జాతులను గుర్తించాం. ఇటీవల ఏర్పాటు చేసిన ప్లాంటేషన్‌లోకి ఇప్పటి వరకు 25 రకాల సీతాకోక చిలుకలు వచ్చాయి. రాబోయే రోజుల్లో మరిన్ని జాతులు వచ్చే అవకాశముంది.
– సుష్మారావు, రేంజ్ ఆఫీసర్, జన్నారం