మంచిర్యాల, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ సర్కారు కాసుల వేటలో పడింది. పైసల్ లేవు, అప్పులయ్యాయని చెప్పుకుంటూ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు మంగళం పాడే పనిలో పడింది. కాగా.. ఎల్ఆర్ఎస్పై మాట మార్చి జనాలకు షాక్ ఇచ్చింది. అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్(లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం)ను ఉచితం చేస్తామని, ఎవ్వరూ ఎల్ఆర్ఎస్ కట్టొద్దని చెప్పి ఇప్పుడు మాట మార్చింది. 2020లో దరఖాస్తు చేసుకున్న వారు పూర్తి రుసుం చెల్లించి లే-అవుట్లను క్రమబద్ధీకరించుకోవాలని ప్లేట్ ఫిరాయించింది.
దీంతో కాంగ్రెసొస్తే ఉచితంగా లే-అవుట్లు, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని జనా లు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. 2020 ఆగస్టు నుంచి అక్టోబర్ 31 వరకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రెండు నెలలపాటు ఎల్ఆర్ఎస్కు దరఖాస్తులు స్వీకరించింది. వచ్చిన దరఖాస్తుల్లో కొన్నింటిని పరిష్కరించగా.. కోర్టు కేసుల కారణంగా ఈ ప్రక్రియ ఆగింది. తాజాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినప్పటికీ నెల రోజుల గడువు మాత్రమే ఇవ్వడం, పైగా పైసలు కట్టాలనడంతో గడువు లోపు ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
సిబ్బంది కొరత.. క్షేత్రస్థాయి పరిశీలన ఎలా..
ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. ఈ పనిని మున్సిపాలిటీల్లోని టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది చేస్తారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లే ఇన్చార్జులుగా పని చేస్తున్నారు. అనుమతి ఇవ్వాలంటే ఎల్1, ఎల్2, ఎల్3 అని మూడు విభాగాలు ఉంటాయి. ఇందు లో ఎల్1 అంటే టీపీబీవోలు క్షేత్రస్థాయికి వెళ్లి స్థలాన్ని చూ శాకే నిర్ణయం తీసుకుంటారు. గ్రీన్‌జోన్, చెరువులు, కుంట లు, ప్రభుత్వ స్థలాలు, వక్ఫ్ భూములు ఉన్న స్థలాల్లో ప్లా ట్లు ఏర్పాటు చేశారా? లేకపోతే అన్ని సరిగ్గానే ఉన్నాయా? అన్నది రిపోర్ట్ చేస్తారు. అలా పరిశీలించిన వాటిని రెండో దశలో ఎల్2లో టీపీవో, టీపీఎస్ సరిచూసుకుని ఒకే చేస్తే నే, మూడో దశ ఎల్3లో మున్సిపల్ కమిషనర్ వాటికి ఆ మోద ముద్ర వేస్తారు.
కానీ.. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో టౌన్‌ప్లానింగ్ విభాగాల్లో ఈ పనులు చేసేందుకు సరిపడా సిబ్బంది లేరు. ఉదాహరణకు.. మంచిర్యాల ము న్సిపాలిటీనే తీసుకుంటే దాదాపు కొన్ని నెలలుగా ఇక్కడ టీ పీవో లేరు. ఇద్దరు టీపీఎస్లతోనే నడిపిస్తున్నారు. ఒకరికి మూడు రోజులు బెల్లంపల్లి, మూడు రోజులు మంచిర్యాల, మరొకరికి మూడు రోజులు మంచిర్యాల, మూడు రోజులు నస్పూర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన మున్సిపాలిటీల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారులు అత్యవసర పనులపై విచారణకు పంపాలనుకున్న సమయంలోనూ టీపీవోలు, టీపీఎస్‌లు ఆ రోజు విధుల్లో ఉండడం లేదు. దీంతో కార్యకలాపాలన్నీ పెండింగ్ పడుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు 66 వేల దరఖాస్తులను నెల రోజుల్లో పరిశీలించి క్లియరెన్స్ ఇవ్వడమేది సా ధ్యం కాదని మున్సిపల్ అధికారులే చెప్తున్నారు. ప్రభుత్వ ఖజానా నింపుకోవడం కోసమే సాధ్యంకాని టార్గెట్‌ను పెట్టిందంటూ పెదవి విరుస్తున్నారు. గతంలో రెండు నెలల టైమ్‌లో సిబ్బంది కొరత లేకుండా ఉన్నప్పుడే ఉమ్మడి జి ల్లాలో 22 వేల దరఖాస్తులను క్రమబద్ధీకరించిన అధికారు లు, కొన్నింటిలో లోపాలను గుర్తించి రిజెక్ట్ కూడా చేశారు.
ఇప్పుడు ఉన్న కొద్దిపాటి సిబ్బందితో నెల రోజుల్లో మూడింతల దరఖాస్తుల పరిశీలన కుదరదని ముఖం మీదే అధికారులు చెప్తేస్తున్నారు. అంతా కలిసిగట్టుగా శ్రమిస్తే 50 శాతం నుంచి 60 శాతం పూర్తి చేయగలమంటున్నారు. అది కూడా జనాలు నిర్దేశిత రుసులు చెల్లిస్తేనే వీలుపడుతుందంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందనేది వేచి చూడాలి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో మందమర్రి మున్సిపాలిటీలో 1/17 యాక్ట్ అమలులో ఉంది. అక్కడ లే-అవుట్లు భూముల క్రయవిక్రయాలకు ఎలాంటి అవకాశం లేదు. అది మినహాయిస్తే మిగిలిన 11 మున్సిపాలిటీల్లో 2020లో ఎల్ఆర్ఎస్ కోసం 88,283 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 22,188 దరఖాస్తులను పరిష్కరించారు. మిగిలిన 66,095లో కొన్నింటిని తిరస్కరించగా, దాదాపు 66 వేల పైచిలుకు దరఖాస్తులకు ఇప్పుడు క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంది. అత్యధికంగా మంచిర్యాల మున్సిపాలిటీలో 18,933, ఆదిలాబాద్‌లో 14,208, నిర్మల్‌లో 11,429, బైంసాలో 8,950, క్యాతన్‌పల్లిలో 5,797 ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు ఉన్నాయి.