
ఆదిలాబాద్, సెప్టెంబర్ 23 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో సభ్యులు 24 అంశాలపై చర్చించారు. విద్యాశాఖ, మిషన్ భగీరథ, రహదారులు భవనాలు, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, గిరిజన సంక్షేమం, వైద్య ఆరోగ్యం, వ్యవసాయం, మార్కెటింగ్, మార్క్ఫెడ్, పరిశ్రమలు, ఉపాధి కల్పన, గృహ నిర్మాణం, విద్యుత్ శాఖ, అటవీ, రవాణా, దళిత అభివృద్ధి శాఖ, వెనుకబడిన తరగతులు, మైనార్టీ సంక్షేమం, స్త్రీ, శిశు, వికలాంగులు, పంచాయతీ, నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి, రవాణా, పౌరసరఫరాల శాఖలపై సభ్యులు చర్చించారు. తమ ప్రాంతాల్లోని వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలు, పనుల్లో జాప్యం, ఇతర సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పారు. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు భారీగా నిధులు మంజూరు చేసిందని, ప్రజలకు వీటిని అందించేలా అధికారులు చూడాలని సభ్యులు కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాలను విజయవంతం చేయాలని జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ సూచించారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు తమ ప్రాంతాల సమస్యలపై సూచించిన అంశాలను పరిగణలోకి తీసుకొని పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
ధరణితో రైతులకు ప్రయోజనం..
ధరణి పోర్టల్ రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. గతంలో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, మ్యుటేషన్ కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత 40 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుండంగా ఎలాంటి అవినీతికి అవకాశం లేకుండా పోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోడు భూములు సాగు చేస్తున్న 35 వేల మంది గిరిజన రైతులకు ప్రభుత్వం గతంలో హక్కు పత్రాలు మంజూరు చేసింది. వారికి రైతుబంధు కూడా వర్తింప జేసింది. ఉమ్మడి జిల్లాలో 2005 కంటే ముందు సాగులో ఉన్న పోడు భూముల వివరాలు అధికారులు సేకరించాలి. జిల్లాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ వేగంగా సాగుతున్నది. అర్హులైన వారందరికీ వైద్యశాఖ అధికారులు టీకాలు ఇస్తున్నారు. ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేసినందుకు వైద్యశాఖ అధికారులను అభినందిస్తున్నాను. విద్యాభివృద్ధికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఎమ్మెల్యేలకు ఇచ్చే నిధుల నుంచి రూ.2 కోట్ల పాఠశాలల అభివృద్ధికి కేటాయిస్తుంది. మిషన్ భగరీథ పథకం ద్వారా ప్రతి గ్రామానికి మంచినీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
క్లోరినేషన్ జరిగేలా చర్యలు
మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి గ్రామానికి మంచినీరు అందిస్తున్నాం. ఈ పథకంతో పల్లెల్లో తాగునీటి సమస్య లేకుండా పోయింది. గ్రామాల్లో నిర్మించిన తాగు నీటి ట్యాంకుల్లో క్రమంగా క్లోరినేషన్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. అధికారులు, సిబ్బందితో క్రమంగా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు రక్షితమైన నీటిని అందిస్తున్నాం.
అర్హులకు కిసాన్ సమ్మాన్ వర్తింపజేయాలి
కిసాన్ సమ్మాన్ పథకాన్ని అర్హులైన వారందరికీ వర్తింపజేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు వ్యవసాయ శాఖ అధికారుల వద్ద సరిగా లేకపోవడంతో రైతులు నష్టపోవాల్సి వస్తున్నది. పథకం అమలవుతున్నప్పటి నుంచి రైతుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది.
గిరిజన పాఠశాలల్లో సౌకర్యాలు
ఉట్నూరు ఐటీడీఏ ఆధ్వర్యంలో 440 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. మొదటి విడుతలో భాగంగా 40 పాఠశాలల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఇందుకోసం ఒక్కో పాఠశాలకు రూ.3 లక్షలను ఖర్చు చేస్తాం. గిరిజన ప్రాంతాల్లో కళాబృందాలతో అవగాహన కల్పిస్తాం. -భవేశ్ మిశ్రా, ఐటీడీఏ పీవో