మంచిర్యాల ఏసీసీ, ఏప్రిల్ 19 : మంచిర్యాల జిల్లాలో శుక్రవారం ఎండ దంచికొట్టింది. గరిష్ఠంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం ఏడింటికే భానుడు భగభగ మండగా, సాయంత్రం ఏడింటి దాకా ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేసింది. అత్యవసర పరిస్థితులుంటే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేదు. మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. గురువారం ఆసిఫాబాద్ జిల్లాలో ఒకరు, మంచిర్యాల జిల్లాలో ఒకరు వడదెబ్బతో ప్రాణాలొదిలారు. ప్రజలు శీతల పానీయాలను ఆశ్రయించడంతో పాటు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లు, ఏసీలను విపరీతంగా వాడుతున్నారు. రోహిణి కార్తెకు నెల రోజుల ముందే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తుండగా, మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
వేసవిలో వడదెబ్బ నుంచి రక్షించుకోవడానికి ప్రతిఒకరూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తలనొప్పి, కండరాలు పట్టేయడం, వికారం, కళ్లుతిగడం, వాంతులు చేసుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ప్రతిరోజూ 5 నుంచి 6 లీటర్ల నీటిని తాగాలని, శీతల పానీయాలకు బదులు మజ్జిగ, నిమ్మ, పండ్ల రసాలు తాగడం ఉత్తమమని, పండ్లు కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు.
బైక్ మీద వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ఎండలో ప్రయాణం చేయకూడదని, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సివస్తే గొడుగు పట్టుకొని వెళ్లాలని సూచిస్తున్నారు. వడదెబ్బ తగిలితే ఓఆర్ఎస్ పొడిని కలిపి తాగించాలని, అది దొరకని పరిస్థితుల్లో నీటిలో కొంచం ఉప్పు లేదా పంచదారా కలుపుకొని తాగాలని, అపస్మారక స్థితిలోకి వెళ్తే నీరు తాగించకుండా వీలైనంత త్వరగా దవాఖానకు తరలించాలని డాక్టర్లు చెబుతున్నారు.