హాజీపూర్, ఆగస్టు 30 : జిల్లాలో రహదారులు, అంతర్గత రోడ్లు, వంతెనల నిర్మాణాలు, మరమ్మతులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా అటవీ అధికారి శాంతారాం, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్‌తో కలిసి జిల్లా అటవీ, రెవెన్యూ, రోడ్లు- భవనాలు, పంచాయతీ రాజ్, ల్యాండ్ సర్వే అధికారులతో అటవీ-రెవెన్యూ భూముల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేమనపల్లి మండలంలోని లక్ష్మీపూర్ నుంచి బద్దంపల్లి వరకు, నెన్నెల మండల కేంద్రం నుంచి కుశ్నపల్లి మీదుగా చామన్‌పల్లి వరకు, బెల్లంపల్లి నుంచి బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు, నెన్నెల మండలంలో ఖాజీపల్లి నుంచి ఆవుడం వరకు, కోటపల్లి మండలంలోని రాచెర్ల నుంచి అన్నారం మీదుగా అర్జునగుట్ట వరకు, వేమనపల్లి మండల కేంద్రం నుంచి నాగారం వరకు, కోటపల్లి మండలం బార్పల్లి నుంచి రాజారాం మీదుగా బబ్బెరచెలుక వర కు, జన్నారం మండలం మొర్రిగూడ నుంచి కలమడుగు వరకు, వెంకటాపూర్ నుంచి కలమడుగు వరకు రహదారులు, వంతెనల పనులను పూర్తి చేయాలన్నారు. జాతీయ రహదారి 63లో జిల్లాలో పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు. చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో జోడువాగుల వద్ద నిర్మించాల్సిన రోడ్డుకు సంబంధించిన క్లియరెన్స్‌లను సంబంధిత శాఖల అధికారులు త్వరగా జారీ చేసి పనులను ప్రారంభించేలా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా, రోడ్లు భవనాల శాఖ ఈఈ రాము, జిల్లా పంచాయతీ రాజ్ ఈఈ ప్రకాశ్, ల్యాండ్ సర్వే శాఖ ఏడీ శ్రీనివాస్, బెల్లంపల్లి ఆర్డీవో శ్యామలాదేవి, మంచిర్యాల, చెన్నూర్ అటవీ డివిజనల్ అధికారులతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.