
నిర్మల్ డీఆర్డీవో సుధీర్
దిలావర్పూర్లో ఉపాధిహామీ ప్రజావేదిక
దిలావర్పూర్, ఆగస్టు 30 : ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత లోపిస్తే ఉపేక్షించేది లేదని డీఆర్డీవో సుధీర్ అన్నారు. దిలావర్పూర్ మండల పరిషత్ కార్యాలయంలో 2018-19, 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఉపాధి హామీ 12వ విడుత సామాజిక తనిఖీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ ఏలాల అమృత హాజరయ్యారు. మొత్తం 12 గ్రామ పంచాయతీల్లో రూ.12 కోట్ల 44 లక్షల 59 వేల 374 ఖర్చు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో 10 రోజుల పాటు గ్రామస్థాయిలో తనిఖీ నిర్వహించిన ఆడిట్ బృందం మండల స్థాయి సమావేశంలో పలు లోపాలను ఎత్తి చూపారు. ప్రజా వేదికకు వచ్చిన పలువురు ప్రజా ప్రతినిధులు పనులు సక్రమంగా జరిగి అర్హులైన కూలీలకు డబ్బులు అందినప్పటికీ సామాజిక తనిఖీ బృందం వారు చిన్నచిన్న వాటిని కొండంతగా చూపడంపై అక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేవారు. ‘రాబోవు రోజుల్లో గ్రామాల్లో పనులు చేయించం.. మీ తనిఖీ బృందాలు, మీ జిల్లా అధికారులు పనులు చేయించండి’ అంటూ ఎంపీపీ, జడ్పీటీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా గుండంపల్లి గ్రామ పంచాయతీ పనులు చదివి వినిపించారు. ఒకరి జాబ్‌కార్డుపై మరొకరు పనులకు వెళ్లారని ఆడిట్ బృందం సభ దృష్టికి తీసుకెళ్లింది. గ్రామాల వారీగా పనుల వివరాలు చదివి వినిపించారు.
ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. మూడేండ్ల తరువాత సామాజిక తనిఖీ బృందం తనిఖీలు చేయడంతో పనులు జరిగిన ప్రదేశాలు గుర్తించలేకపోవడంతో పాటు పలు గ్రామాల్లో చెరువులు నిండి పనులు చూడలేక ఉన్నప్పటికీ తనిఖీ బృందం తప్పులు చూపడం భావ్యంగా లేదన్నారు. అనంతరం పీడీ సుధీర్ మాట్లాడుతూ.. ఉపాధి పనులు సక్రమంగా నిర్వహించాలని, పనులు చేసే సమయంలో పనికి ముందు, పని తర్వాత ఫొటోలు తప్పక ఉండాలని సంబంధిత ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్లకు సూచించారు. అర్హులైన కూలీలకు పని కల్పించాలని, ఒకరి జాబ్‌కార్డుపై మరొకరు పనికి వెళ్లే పరిస్థితులు రావద్దని, అందరికీ జాబ్‌కార్డులు ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తక్కల రమణారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా సభ్యులు ఏలాల చిన్నారెడ్డి, ఎంపీడీవో మోహన్‌రెడ్డి, ఎంపీవో అజీజ్‌ఖాన్, ఈజీఎస్ ఏపీవో జగన్నాథం, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ కూలీలు పాల్గొన్నారు.