ఇచ్చోడ, మే 2 : మండలంలోని మాదాపూర్‌లో వ్యవసాయ క్షేత్రంలోని రేకుల షెడ్డులో అనుమానాస్పదంగా, సరైన పత్రాలు లేకుండా నిల్వ ఉంచిన 256 క్వింటాళ్ల జొన్నలు పట్టుకున్నట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. రెవెన్యూ, వ్యవసాయ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఏవో గణేశ్, ఆర్ఐ హుస్సేన్ వచ్చి పంచనామా నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం సీజ్ చేసి మార్కెట్‌యార్డు సిబ్బందికి అప్పగించినట్లు తెలిపారు. రైతులు పత్రాలు తీసుకొని వస్తే వదిలి పెడతామని మార్కెట్ యార్డు, వ్యవసాయ శాఖాధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, డిప్యూటీ తహసీల్దార్ రామారావ్ పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, మే 2 : మండలంలోని హీరాపూర్‌లో మార్కెట్ కమిటీ, రెవెన్యూ శాఖ అధికారుల ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా జొన్నలు తరలిస్తున్న వాహనాన్ని అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం మండల కేంద్రానికి చెందిన ఓ వ్యాపారి వాహనంలో 45 క్వింటాళ్ల జొన్నలను బినామీ పేరుతో తీసుకువస్తున్నట్లు ముందస్తుగా అందిన సమాచారం మేరకు మండలంలోని హీరాపూర్లోని చెక్‌పోస్ట్ వద్ద వాహనానికి తనిఖీ చేశారు. బినామీ పేరుతో జొన్నలు ఉన్నట్లు గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు. రెవెన్యూ శాఖ అధికారులు, మార్కెట్ శాఖ అధికారులు జొన్నల వాహనాన్ని పంచనామా చేసి, పోలీసులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, డిప్యూటీ తహసీల్దార్ రమేశ్, మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్, ఎస్ఐ సాయన్న తదితరులు పాల్గొన్నారు.
కుభీర్, మే 2 : కుభీర్‌లోని మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రానికి శుక్రవారం మహారాష్ట్ర పాసింగ్ కలిగిన ఐచర్ వాహనం జొన్న సంచులు లోడుతో వచ్చింది. దీన్ని గమనించిన రైతులు, రైతు నాయకులు అడ్డుకుని కేంద్రం బయట నిలిపివేశారు. జిల్లా మార్కెటింగ్ శాఖ, సహకార శాఖల అధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు ఆ వాహనాన్ని బయట కు పంపించారు. దళారులు మహారాష్ట్రలోని గ్రామాల్లో త క్కువ ధరకు జొన్నలను కొని ఇక్కడి రైతుల పేర్ల మీద కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి వచ్చిన జొ న్నలు ఇక్కడ విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని ఇటీవల ఎమ్మెల్యే రామారావు పటేల్ అధికారులకు హెచ్చరించినా తీరు మారడం లేదు. ఇప్పటికైనా జిల్లా అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఈ దందాకు అడ్డుకట్ట వేయాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై మార్కె ట్ కార్యదర్శి గంగన్నను వివరణ కోరగా ఈ వాహనం కుభీర్‌కు చెందినదని తెలిపారు. సరైన పత్రాలు లేక పోవడంతో వాహనాన్ని బయటకు పంపించామని తెలిపారు.