
ఆదిలాబాద్ జిల్లా మార్కెటింగ్ ఏడీఎం శ్రీనివాస్
పత్తి తూకంలో వ్యత్యాసంపై విచారణ
ఇంద్రవెల్లి, నవంబర్ 29 : రైతుల నుంచి పత్తిపంట కొనుగోలు చేస్తున్న జిన్నింగ్ మిల్లుల యాజమాన్యులతోపాటు వ్యాపారులు తూకంలో రైతులను మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ జిల్లా మార్కెటింగ్ ఏడీఎం శ్రీనివాస్ అన్నారు. మండలంలోని సమక ఎక్స్‌రోడ్డు వద్ద ఉన్న మిత్తల్ జిన్నింగ్ మిల్లుతో పాటు ఏమాయికుంటలోని విజయలక్ష్మి జిన్నింగ్ మిల్లు, ఐఎఫ్పీసీఎల్ (రైతు సం ఘం) జిన్నింగ్ మిల్లులను జిల్లా మార్కెటింగ్ ఏడీ ఎం శ్రీనివాస్ సోమవారం తనిఖీ చేశారు. జిన్నిం గ్ మిల్లుల్లో ఏర్పాటు చేసిన తూకాలను పరిశీలించారు. పత్తిబండ్లతోపాటు వాహనాలను తూకం వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటికే మిత్తల్ జిన్నింగ్ మిల్లులో ఓ రైతు పత్తి విక్రయించడానికి వస్తే తూకంలో 35కిలోలు తక్కువ వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. తూకం మోసాలపై పూర్తి విచారణ చేసి రైతుకు పూర్తి న్యాయం చేసే విధంగా కృషి చేస్తామన్నారు. బాధిత రైతుని మిత్తల్ జిన్నింగ్ మిల్లుకు పిలిపించి యాజమాన్యం సమక్షంలో పూర్తి విచారణ జరిపిస్తామని చెప్పారు. తూకంలో మోసం జరిగినట్లు తేలితే జిన్నింగ్ మిల్లు యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామని, బాధిత రైతుకు డబ్బులు ఇప్పిస్తామని చెప్పారు. పత్తి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు తప్పకుండా లైసెన్సులు కలిగి ఉండాలని సూచించారు. లైసెన్స్ లేకుండా కొనుగోలు చేస్తే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి రాజేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.