లక్షెట్టిపేట రూరల్, సెప్టెంబర్ 29 : పట్టణాలను, పల్లెలను పరిశుభ్రంగా ఉంచుతున్నది పారిశుధ్య కార్మికులేనని, వారి సేవలు అభినందనీయమని లక్షెట్టిపేట మున్సిపల్ చైర్మన్ కాంతయ్య పేర్కొన్నారు. పట్టణంలో బుధవారం అంబేద్కర్ చౌరస్తాలో మూసుకుపోయిన నాళాను రెండు రోజులు కష్టపడి శుభ్రం చేసిన 29 మంది పారిశుధ్య కార్మికులను మున్సిపల్ నాయకులు సన్మానించారు. చెత్త సేకరణ, డ్రైనేజీలను శుభ్రం చేయడం లాంటి పనులు చేస్తున్న కార్మికులను సన్మానించడం వారికిచ్చే నిజమైన గౌరవమని పేర్కొన్నారు. ప్రజలు ప్లాస్టిక్ కవర్లను డ్రైనేజీల్లో వేయకుండా స్వచ్ఛ ఆటోల్లోనే వేయాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 80 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశామని తెలిపారు. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చల్లా నాగభూషణం, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్, మేనేజర్ శ్రీహరి, మున్సిపల్ కౌన్సిలర్లు చాతరాజు రాజన్న, లావుడ్యా సురేశ్ నాయక్, చింత సువర్ణ, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు నూనె ప్రవీణ్, సయ్యద్ షాహిద్ అలీ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు గడ్డం వికాస్, గరిసే రవీందర్,తదితరులున్నారు.
రోడ్లపై ఆక్రమణలు తొలగించాలి
లక్షెట్టిపేట రూరల్, సెప్టెంబర్ 29: రోజురోజుకూ జనాభా పెరుగుతున్నందున పట్టణంలో రోడ్డు ఆక్రమణలు తొలగించి ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలని మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య పేర్కొన్నారు. బుధవారం మున్సిపల్ సాధారణ సమావేశం జరిగింది. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ లక్షెట్టిపేట, ఇటిక్యాల, మోదెల, ఊత్కూర్ పరిధిలో బతుకమ్మల నిమజ్జనం, దసరా పండుగకు ఏర్పాట్లు చేయాలన్నారు.అనంతరం ఉత్కూర్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డు ఆక్రమణలు తొలగించాలని, మురుగు కాలువల్లోని చెత్తను తొలగించాలని తీర్మానించినట్లు తెలిపారు. అంబేద్కర్ చౌరస్తాలో చెత్తను తొలగించిన పారిశుధ్య కార్మికులను, కమిషనర్ ఆకుల వెంకటేశ్‌ను మున్సిపల్ పాలక వర్గం అభినందించింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలక వర్గ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.