
ఇరిగేషన్ అధికారులకు కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశం
బ్యారేజీ నిర్మాణ స్థల పరిశీలన
కౌటాల, జనవరి 29 : వార్దా నదిపై బ్యారేజీ నిర్మాణ పనుల శంకుస్థాపనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. తెలంగాణ ప్రభు త్వం వార్దా నదిపై బ్యారేజీ ని ర్మాణానికి అనుమతులు ఇవ్వ గా నిర్మాణ స్థలాన్ని శనివారం ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. కౌటాల మండలంలోని గుండాయిపేట సమీపంలోని వార్దా నదిపై ఈ బ్యారేజీ నిర్మాణ పనుల శంకుస్థాపనకు వచ్చే నెల 1న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు సీఎంవో స్మితా సబర్వాల్ రానున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో కలిసి చర్చించారు. బ్యారేజీ నిర్మాణ స్థలం, హెలిప్యాడ్, అధికారుల కార్ల పార్కింగ్ స్థలం తదితరాల గురించి అధికారులతో చర్చించారు. బ్యారేజీ నిర్మాణం కోసం వ్యా ప్కోస్ లిమిటెడ్ సంస్థ సిబ్బంది సర్వే నిర్వహించి అధికారులకు నివేదికలు సమర్పించారు. వార్దా నదిపై నిర్మించే ఈ బ్యారేజీలో 160 మీటర్ల నీటి నిలువ సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించనున్నారు. నదిపై సుమారు 1.2 కిలోమీటర్ల దూరం ఈ బ్యారేజి నిర్మించనున్నారు. ఆయన వెంట కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ ఈఈ ప్రభాకర్, సీఈ రమేశ్, ఎస్ఈ కుమార స్వామి, డీఈలు వెంకటరమణ, భానుమూర్తి, అన్నాజీ రావు, భద్రయ్య, టెక్కికల్ డీఈ తిరుపతి, జేఈలు నవీన్, చేతన్, సీపీవో రవీందర్, ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్, తహసీల్దార్ రాంలాల్, ఎంఆర్ఐ దేవేందర్, ఎంపీవో శ్రీధర్ రాజు, ఏపీవో పూర్ణిమ తదితరులున్నారు.
పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు..
వచ్చే నెల 1న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ నాయకులు, అధికారులు గుండాయిపేట వార్దా నది తీరానికి రానున్న తరుణంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు డీఎస్పీ కరుణాకర్ తెలిపారు. వార్దా నది తీరాన హెలిప్యాడ్ ఏర్పాటు, నదీ పరివాహక ప్రాంతం మహారాష్ట్రతో అనుసంధానమై ఉండడంతో ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు రోడ్డు మార్గాన గుండాయిపేట సమీపంలోని వార్దా నది సమీపంలోని బ్యారేజీ నిర్మాణ స్థలానికి చేరుకోనున్నందున ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట కౌటాల సీఐ బుద్ధే స్వామి, ఎస్ఐ ఆంజనేయులున్నారు.
రైతుల్లో వెల్లి విరుస్తున్న ఆనందం..
గతంలో తుమ్డిహట్టి వద్ద ప్రాణహిత నదిపై డా బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకు స్థాపన చేసినప్పటికి ఆగిపోయింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక దానిని రీ డిజైన్ చేసి వార్దా నదిపై ఎలాగైనా బ్యారేజీ నిర్మించాలని పలు సంస్థలతో సర్వే చేయించింది. సర్వేల అనంతరం గుండాయిపేట గ్రామ సమీపంలోని వార్దా నదిపై బ్యారేజీ నిర్మించడం వలన అందులో 160 మీటర్ల (4టీఎంసీ)ల నీరు అందుబాటులో ఉండనుంది. దీంతో కౌటాల మండలంతో పాటు సిర్పూర్ నియోజక వర్గంలోని పలు గ్రామాల పంట పొలాలకు పుష్కలంగా సాగు నీరు అందే అవకాశాలున్నాయి. వ్యవసాయం అభివృద్ధే ధ్యేయంగా బ్యారేజీ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషిని ఈ ప్రాత రైతులు కొనియాడుతున్నారు.
ప్రతి మొక్కనూ కాపాడాలి..
కౌటాల, జనవరి 29 : పల్లె ప్రకృతి వనంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం మండలంలోని కౌటాల, మొగడ్ధగడ్, విర్దండి, గుండాయిపేట గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలను ఆయన పరిశీలించారు. కౌటాల పల్లె ప్రకృతి వనంలో మొక్క నాటి నీరు పోశారు. పల్లె ప్రకృతి వనాలు దట్టమైన అడవులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఆయన వెంట ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్, మండల ప్రత్యేక అధికారి రవీందర్ తహసీల్దార్ రాంలాల్, ఎంఆర్ఐ దేవేందర్, ఎంపీవో శ్రీధర్ రాజు, ఏపీవో పూర్ణిమ, సర్పంచ్ వొజ్జల మౌనిశ్, తదితరులున్నారు.
సుందరీకరణ పనులు వేగవంతం చేయండి..
సిర్పూర్(టీ), జనవరి 29 : పల్లె ప్రకృతి వనంలో సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. శనివారం మండల కేంద్రంలోని బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలను కాపాడాలని, పనులను పూర్తి చేసి, గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట సర్పంచ్ తఫిమా పర్విన్, ఎంపీడీవో రాజేశ్వర్, మండల కో ఆప్షన్ సభ్యుడు కీజర్హుస్సేన్, ఈవో కృష్ణమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.