
బెజ్జూర్, జనవరి 29 : కరోనా ప్రభావంతో తరగతులు ఆలస్యంగా ప్రారంభమైనందున పదో తరగతితో పాటు ఇంటర్ విద్యార్థులపై దృష్టి సారించి, వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలని డీఈవో అశోక్ సూచించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ 100 శాతం ఉత్తీర్ణతకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు సలుగుపల్లి, పాపన్ పేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను శనివారం ఆయన సందర్శించారు. మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని తెలుసుకుంటున్నట్లు తెలిపారు. 8,9,10 తరగతుల విద్యార్థులకు కొనసాగుతున్న ఆన్లైన్ క్లాసుల తీరును సంబంధిత ఉపాధ్యాయలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఆన్లైన్లో క్లాసులు వింటున్నారా లేదా? అదే విధంగా ఆన్లైన్ క్లాసుల్లో విద్యార్థుల సందేహాలను తీర్చేందుకు విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి నివృత్తి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఇప్పటి వరకు నిర్వహించిన ఎస్ఏ1, ఎఫ్ఏ1 పరీక్షల ఫలితాలను సెలవుల్లోనే ఆన్లైన్ చేయాలన్నారు. జిల్లాలో ఆధార్ అనుసంధానం కాని విద్యార్థులు సుమారుగా 6 వేల మంది ఉన్నారని, ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు. పాఠశాలల అభివృద్ధి నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. మండలంలోని కుకుడ ఎంపీయూపీఎస్ భవన నిర్మాణం అసంపూర్తిగా ఉన్నందున కలెక్టర్‌తో మాట్లాడి పూర్తి చేయిస్తామన్నారు. ఈవిషయమై ఏఈతో ఫోన్లో మాట్లాడారు. రెబ్బెన, కుశ్నపల్లిలోని పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరగా వాటిని మరమ్మతు చేయిస్తామని చెప్పారు. ఆయన వెంట అసిస్టెంట్ కమిషనర్ ఉదయ్ బాబు, ఎంఈవో రమేశ్ బాబు, ఎస్వో అరుణ, ఆయా పాఠశాలల హెచ్ఎంలు ఉన్నారు.