
ఏకగ్రీవంగా ఎన్నిక
అభినందించిన ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావ్
కార్యకర్తల సంబురాలు
ఆదిలాబాద్, జనవరి 29 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): డీసీసీబీ చైర్మన్‌గా అడ్డి భోజారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత చైర్మన్ మృతితో స్థానం ఖాళీ కాగా, ఆరు నెలల్లోగా భర్తీ చేయాల్సి ఉంది. ఈ మేరకు శనివారం నామినేషన్లు స్వీకరించగా, ఆయన ఒక్కరే దాఖలు చేశారు. దీంతో అధికారులు ఆయనను చైర్మన్‌గా ప్రకటించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్‌గా అడ్డి భోజారెడ్డి ఎన్నికయ్యారు. డీసీసీబీ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. గతంలో డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న కాంబ్లే నాందేవ్ గుండెపోటుతో మృతిచెందారు. అప్పటి నుంచి డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్‌రెడ్డి ఇన్చార్జి చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఆరు నెలల్లో చైర్మన్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, అధికారులు శనివారం ఈ ప్రక్రియను పూర్తి చేశారు. చైర్మన్ ఎన్నికలో భాగంగా డీసీసీబీ కార్యాలయంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. తాంసి పీఏసీఎస్ చైర్మన్, బ్యాంకు డైరెక్టర్‌గా ఉన్న అడ్డి భోజారెడ్డి మొదట నామినేషన్ వేశారు. సమయం ముగిసినా ఇతరులు నామినేషన్ వేయలేదు. ఒకే నామినేషన్ వచ్చినందున, అడ్డి భోజారెడ్డి డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఈయన గతంలో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా రైతుబంధు కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికైన అడ్డి భోజారెడ్డిని పలువురు అభినందించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ డీసీసీబీ పాలకవర్గ సభ్యులు, అధికారులు, సిబ్బంది, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలు పటాకలు కాల్చి సంబురాలు నిర్వహించారు.
బ్యాంకు అభివృద్ధికి కృషి : అడ్డి భోజారెడ్డి, డీసీసీబీ చైర్మన్
అందరి కృషితో ఈ పదవి రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రూ. 12 వందల కోట్ల టర్నోవర్‌తో నడుస్తున్నది. నేను రైతుబిడ్డను. బ్యాంకు ద్వారా అవసరమైన వారికి రుణాలు అందేలా చూస్తాను. పాలకవర్గం, అధికారులు, సిబ్బంది సహకారంతో బ్యాంకు, రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నా.