
ఉత్సవాలకు ముస్తాబైన ఆలయం
ఐదు రోజుల పాటు నిర్వహణ
ఇప్పటికే మర్రిచెట్ల వద్దకు చేరిన మెస్రం వంశీయులు
తరలిరానున్న ఆదివాసీ భక్తులు
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం
ఇంద్రవెల్లి, జనవరి 29: ప్రతి యేటా ఫుష్యమాసం అమావాస్య రోజున అర్ధరాత్రి నాగోబాకు మెస్రం వంశీయులు ప్రత్యేక మహాపూజలు నిర్వహించడంతో నాగోబా జాతర ప్రారంభమవుతుంది. మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలంలోని హస్తలమడుగు నుంచి సేకరించిన గంగాజలంతో అభిషేకం చేయనున్నారు. మెస్రం వంశీయుల మహాపూజలతో ప్రారంభమైన నాగోబా జాతర అధికారికంగా ఐదు రోజులపాటు కొనసాగుతుంది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్, బిహార్, ఏపీ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. విదేశాల నుంచి పర్యాటకులు, సందర్శకులు నాగోబా దర్శనానికి వస్తుంటారు. ఇప్పటికే గంగాజలంతో మర్రిచెట్ల వద్దకు చేరుకున్న మెస్రం వంశీయులు, సోమవారం సాయంత్రం ఎడ్లబండ్లతో గోవాడ్‌కు చేరుకోనున్నారు. నాగోబా ఆలయాన్ని పవిత్ర గంగాజలంతో శుద్ధి చేసిన అనంతరం నాగోబాకు అభిషేకం చేసి నైవేద్యాన్ని సమర్పించి మహాపూజలు నిర్వహిస్తారు. ఆలయంలో ఏడు రకాల పాముల పుట్టలను తయారు చేసి వాటికి ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. దీంతో నాగోబా అనుగ్రహం కలుగుతుందని మెస్రం వంశీయులతోపాటు ఆదివాసీ గిరిజనుల నమ్మకం.
ఆలయ చరిత్ర
కెస్లాపూర్ నాగోబా జాతరకు ఘనమైన చరిత్ర ఉంది. క్రీ,శ 740లో కెస్లాపూర్ గ్రామానికి చెందిన నాగభక్తుడు పడియేరు శేషసాయి నాగదేవతను దర్శించుకునేందుకు నాగలోకానికి వెళ్లాడు. అక్కడ ద్వారపాలకులు అడ్డగించి నాగరాజు లేరని చెబుతారు. శేషసాయి నిరుత్సాహంతో నాగరాజు శేషతల్పం తాకి కెస్లాపూర్‌కు వెనుదిరుగుతాడు. దానధర్మాలు చేయడం ప్రారంభిస్తాడు. లోక సందర్శన ముగించుకున్న నాగరాజు శేషతల్పంపై ఆసీనుడవుతాడు. శేషతల్పాన్ని మానవుడు తాకిన విషయం తెలుసుకొని నాగేంద్రుడు ఆగ్రహిస్తాడు. శేషసాయిని అంతమొందించేందుకు భూలోకానికి వస్తాడు. గమనించిన శేషసాయి ప్రాణభీతితో కాలజ్ఞాన పురోహితుడు ప్రధాన్ పడమార్ దగ్గరకు వెళ్తాడు. నాగరాజును శాంతిపజేసే మార్గాన్ని తెలుసుకుంటాడు. ఏడు కడవల ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు తదితర ఏడు రకాలతో నైవేద్యంగా సమర్పిస్తాడు. గోదావరి హస్తలమడుగు నీటిని 125 గ్రామాల మీదుగా తిరుగుతూ తీసుకొచ్చి నాగరాజును అభిషేకిస్తాడు. దీంతో కెస్లాపూర్ వద్ద ఉన్న పుట్టలోకి నాగరాజు వెళ్లి అక్కడే తన నివాసంగా మార్చుకుంటాడు. అప్పటి నుంచి ఏటా పుష్యమాసం అమావాస్య రోజున అర్ధరాత్రి మెస్రం వంశీయులు నాగోబాకు మహాపూజలు నిర్వహిస్తున్నారు.
మెస్రం వంశీయులే అర్చకులు..
నాగోబా దేవతకు మెస్రం వంశీయులే అర్చకులుగా వ్యవహరిస్తూ మహాపూజలు నిర్వహిస్తారు. మెస్రం వంశంలో 22 తెగలు ఉన్నాయి. అందులో ఏడుగురు దేవతలను కొలిచేవారంతా మెస్రం వంశస్తులు. మడావి, మర్సుకోల, పుర్కా, మెస్రం, వెడ్మ, పంద్ర, ఉర్వేత, ఇలా ఇంటిపేర్లు గల వారంతా మెస్రం వంశీయులు. కాగా, మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని హస్తలమడుగు వద్ద గోదావరినది నుంచి గంగాజలాన్ని సేకరించడానికి బయలు దేరడంతో నాగోబా జాతరకు అంకురార్పరణ పడుతుంది. అమావాస్య రోజు అర్ధరాత్రి నాగోబాకు గంగాజలంతో జలాభిషేకం చేసి మెస్రం వంశీయులే మహాపూజలు నిర్వహిస్తారు. జాతరకు వచ్చే మెస్రం వంశీయులకు చెందిన మహిళలు వంటలు చేసుకునేందుకు గోవాడలో 22 పొయ్యిలను ఏర్పాటు చేస్తారు. మహాపూజలకు కావాల్సిన నైవేద్యాలు అక్కడే వండుతారు. గోవాడ్లోకి ఇతరులు రాకుండా నిబంధనలు విధిస్తారు.
మర్రిచెట్ల నుంచేప్రత్యేక పూజలు ప్రారంభం..
మర్రిచెట్ల వద్ద నాలుగు రోజులపాటు బసచేసిన మెస్రం వంశీయులు అక్కడి నుంచే నాగోబాకు నిర్వహించే ప్రత్యేకపూజలను ప్రారంభిస్తారు. అందరూ కలిసి సామూహికంగా వంటలు చేసుకొని సహపంక్తి భోజనాలు చేస్తారు. మెస్రం పెద్దలు, మెస్రం పటేళ్లు నాగోబాకు నిర్వహించే మహాపూజలపై చర్చిస్తారు. జాతర సందర్భంగా ఏర్పాటు చేసే దర్బార్‌కు ప్రత్యేక స్థానం ఉంది. గిరిజనుల సమస్యలు పరిష్కరించేందుకు ఈ దర్బార్‌ను నిర్వహిస్తారు. హైమన్‌డార్ఫ్ 1946లో మొదటిసారి దర్బార్‌ను నిర్వహించారు. అప్పటి నుంచి ఏటా ఐటీడీఏ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి, గిరిజన సమస్యలను పరిష్కరిస్తున్నారు.
పూజలపై చర్చ
మర్రిచెట్ల ప్రాంతంలో సేదదీరుతున్న మెస్రం వంశీయులు అక్కడే శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వంశీయుల్లోని పెద్దలు మహిళలు, పురుషులు వేర్వేరుగా కూర్చొని కచేరీ నిర్వహించి, నాగోబా పూజలపై చర్చించారు. మహాపూజలకు ఉపయోగించే మట్టికుండలు నాగోబా ఆలయం వెనుకభాగంలో భద్రంగా ఉంచారు. వంశీయుల్లోని 22కితల వారీగా మహిళలు సామూహిక వంటలు చేయగా, మర్రిచెట్ల వద్ద కుటుంబ సమేతంగా బసచేస్తున్న మెస్రం వంశీయులు సామూహిక వంటలతో సహప్తంకి భోజనాలు చేశారు.
సౌకర్యాల పరిశీలన
నాగోబా జాతరకు చేస్తున్న ఏర్పాట్లను ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వెంకటేశ్వర్లు పరిశీలించారు. మర్రిచెట్ల ప్రాంతంతోపాటు గోవాడ్ పరిసరాల్లో, దర్బార్ ప్రాంతంలో ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు, స్నానపు గదులను శనివారం ఆయన పరిశీలించారు. కెస్లాపూర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపడుతున్నారు. ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాస్, ఏఈ భానుకుమార్, ఆలయ పూజారి మెస్రం షేకు, తదితరులు పాల్గొన్నారు.