
ఐదు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు రాయడం, చదవడం
15 రోజుల పాటు నిర్వహణ ప్రతిభ ఆధారంగా మార్కులు
వెనుకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
సారంగాపూర్, నవంబర్ 28;కరోనా కారణంగా విద్యార్థులు దాదాపు ఏడాదిన్నరపాటు చదువుకు దూరంగా ఉండగా, వారిలో సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురుకులాల్లో ఐదు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు చదవడం, రాయడం కార్యక్రమాన్ని నిర్వహించింది. ఉపాధ్యాయులు ప్రతి రోజూ ఒక్కో పాఠ్యాంశం నుంచి 20 పదాల ప్రశ్నలు ఇచ్చి వారి ప్రతిభ ఆధారంగా మార్కులు ఇచ్చారు. మరోవైపు వెనుకబడ్డ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వారిలో నైపుణ్యం పెంచేందుకు కృషి చేస్తున్నారు.
ఐదు నుంచి తొమ్మిదో తరగతి వరకు..
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఐదో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ నెల 15వ తేదీ నుంచి చదవడం, రాయడం కార్యక్రమాన్ని నిర్వహించారు. నేటితో (29వ తేదీ) ఈ కార్యక్రమం ముగుస్తుంది. ప్రతి రోజూ జబ్లీంగ్ పద్ధతిలో ఇతర పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, పాఠ్యాంశాల నిపుణులు హాజరై పరీక్షలు నిర్వహించారు. ప్రతి రోజూ ఒక్కో పాఠ్యాంశం నుంచి 20 పదాలు అడుగుతూ వచ్చారు. ఇందులో పది పదాలకు సమాధానం చెప్పిన విద్యార్థులకు ఒక మార్కును కేటాయించారు. అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థికి ‘0’ మార్కును ఇచ్చారు. అలాగే పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు మాత్రం కేవలం చదవడం కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్తిగా వెనుకబడిన విద్యార్థులు ప్రతిభ కనబర్చే వరకు ప్రత్యేక శ్రద్ధ చూపనున్నారు.
రెండు చాప్టర్లు.. 20 పదాలు
రెండు చాప్టర్లపై ప్రత్యేకశ్రద్ధ వహించి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయించారు. గురుకులాల విద్యాశాఖ నుంచి ఆయా పాఠశాలలకు 20 పదాలకు సంబంధించిన పేపర్లను పంపించారు. ఇందులో కొన్ని సున్నితంగా ఉన్న పదాలు, మరికొన్ని కఠిన పదాలతో పేపర్‌ను తయారు చేశారు. వారు పంపిన పరీక్ష పేపర్‌ను విద్యార్థులకు అందజేస్తారు. విద్యార్థి మూడు నిమిషాల్లో చదవడం, రెండు నిమిషాల్లో పదాలకు సమాధానాలు రాయించడం చేయించారు.
విద్యార్థులకు ఎంతో మేలు
కరోనాతో 14 నెలల పాటు విద్యార్థులు చదువుకు దూరంగా ఉన్నారు. సాంఘిక సంక్షేమ గురుకులాల ప్రిన్సిపాల్ సెక్రెటరీ ప్రవేశపెట్టి రీడింగ్, రైటింగ్ కార్యక్రమం వలన విద్యార్థులకు ఎంతో మేలు జరగుతుంది. మరిచిపోయిన చదువును మళ్లీ చెప్పి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాం. చదవడం, రాయడం వస్తే విద్యార్థులకు మార్కులను వేయడం జరగుతుంది. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. – రాగలత, ప్రిన్సిపాల్, గురుకులం జామ్
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం
కరోనా కారణంగా రెండేళ్లుగా బోధన నిలిచిపోయింది. దీంతో రాష్ట్రవ్యా ప్తంగా చదవడం, రాయడం పరీక్షలు నిర్వహిస్తున్నాం. కరోనా సమయంలో ప్రత్యక్ష బోధన లేకపోవడం, నెట్ సదుపాయం అంతంత మాత్రంగా ఉండడంతో విద్యార్థులు చదువులో కాస్త వెనుకబడ్డారు. వారిలో నైపుణ్యం పంచే దిశగా ప్రయత్నిస్తున్నాం.
సులువుగా చదవగలిగా..
గురుకుల పాఠశాల ఉపాధ్యా యులు చదవడం, రాయడంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహిం చారు. ఆంగ్లం, తెలుగు, హిందీ, గణితం పరీక్షలు జరిగాయి. మా పాఠశాలలో జరిగిన పరీక్షలకు ముథోల్, బాసర, కడెం, లెప్టుపోచంపాడ్ పాఠశాలల ఉపాధ్యాయులు హాజరై, పలు ప్రశ్నలు అడిగారు. నేను సులువుగా చెప్పగలిగాను. చదవడం ప్రతిభ కనబర్చి మంచి మార్కులు సాధించాను.