
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
వివిధ పనులపై అధికారులతో సమీక్ష
ఎదులాపురం. జనవరి 28 : గ్రామాల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు వారంలోగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో శ్మశాన వాటికలు, సెగ్రిగేషన్షెడ్లు, కల్లాల నిర్మాణాలు ఎఫ్టీవోలు ఇప్పటి వరకు అప్లోడ్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్లోడ్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీలు జారీ చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిని ఆదేశించారు. సర్పంచ్ల సహకారంతో పెండింగ్లో ఉన్న పనులు వారంలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వారం అనంతరం మళ్లీ సమీక్షిస్తానని అప్పటి వరకు ఎఫ్టీవోలు అప్లోడ్ చేయ కుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ ఎంసీసీ, డీసీసీ అధికారులు శ్మశాన వాటికలకు సంబంధించిన ఖర్చుల వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న నిర్మాణాలు వేగవంతం చేసేందుకు ఎంపీడీవోలు సర్పంచ్లతో మాట్లాడి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో క్షేత్ర పర్యటన నిర్వహిస్తామని, ఆ పర్యటనలో నిర్మాణాలు పూర్తి కాకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్, పంచాయతీ రాజ్ ఈఈ మహావీర్, డీపీవో శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి ఆశాకుమారి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు రమేశ్, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రాథోడ్ రవీందర్, ఎంపీవోలు, ఇంజినీరింగ్ అధికారులు, ఏపీవోలు పాల్గొన్నారు.
అర్హులకు పథకాలు అందేలా చూడాలి
జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు అర్హులకు అందేలా అధికారులు కృషి చేయాలని ఎంపీ సోయం బాపురావ్ అన్నారు. జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం వర్చువల్ విధానం ద్వారా నిర్వహించారు. వ్యవసాయం, వైద్యం, డబుల్ బెడ్రూం, స్త్రీ, శిశు సంక్షేమ, మిషన్ భగీరథ, విద్యుత్, మైనింగ్, రైల్వే, పౌర సరఫరాశాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ కొవిడ్ కారణంగా దిశ కమిటీ సమావేశానికి అంతరాయం కలిగిందని, ఇక ముందు సకాలంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించేందకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసం నిధులు అందిస్తున్నాయని ఎస్సీ, ఎస్డీలకు కుల ధ్రువీకరణ పత్రాలు సంబంధిత తహసీల్దార్లు అందించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ రైతుల భూముల్లో భూసార పరీక్షలు పెంచేందుకు వచ్చే సంవత్సరం ఎక్కువ లక్ష్యాలు చేపట్టేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తామని అన్నారు. వర్చువల్ సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తమ్ జాడే, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి
జిల్లాలో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు పరిచేలా ఏర్పాట్లు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ విద్య శాఖ కార్యదర్శి అనిత కార్వాల్ అన్నారు. నేషనల్ అసెస్మెంట్ సర్వేపై జాతీయ స్థాయి విద్యా మంత్రిత్వ శాఖ వర్చువల్ సమావే శం నిర్వహించారు. క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖ కార్యదర్శి అనితా కార్వాల్ మాట్లాడుతూ 2017 జాతీయ స్థాయిలో నిర్వహించిన నేషనల్ అసెస్మెంట్ సర్వేలో 3,5,8,10వ తరగతుల విద్యార్థులకు వారి అభ్య సన సామర్థ్యాలను పరీక్ష నిర్వహించగా.. 8 రాష్ర్టాల్లోని 8 జిల్లాల్లో అత్యంత తక్కువ ప్రతిభ కనబరిచినట్లు తేలిందని కేంద్ర విద్యాశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో ఫిబ్రవరి నుంచి జనవరి 2023 వరకు కనీస అభ్యాసన సామర్థ్యాలను పెంచేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని కలెక్టర్లు, విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో రాయడం, చదవడం, కనీస విద్యాబోధనపై దృష్టి సారించి తగిన ప్రణాళికలు రూపొందించాలని జిల్లా విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి ప్రణీత, సెక్టోరియల్ అధికారి నర్సయ్య పాల్గొన్నారు.