
తయారు చేస్తున్న గుగ్గిల్ల వంశీయులు
పూజల్లో ఈ కుండలదే ప్రత్యేకత
సిరికొండ, జనవరి 28: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో నిర్వహించే నాగోబా జాతరకు, సిరికొండ మండలానికి ప్రత్యేక అనుబంధముంది. గిరిజన ఆదివాసుల ఆరాధ్య దైవమైన నాగ దేవతకు పూర్వం నుంచి సిరికొండలోని గుగ్గిల్ల వంశీయులు తయారు చేసిన మట్టి కుండలనే మెస్రం వంశీయులు తీసుకెళ్లి సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
కుండలకు ప్రత్యేక చరిత్ర..
మెస్రం వంశానికి చెందిన ఓ పెద్ద మనిషికి ఒకరోజు నాగ దేవత కలలోకి వచ్చి సిరికొండలో గుగ్గిల్ల వంశీయులు తయారు చేసిన కుండలనే పూజకు వాడాలని చెప్పింది. అప్పటి నుంచి నాగోబా జాతరకు ఈ కుండలనే వాడుతున్నారు మెస్రం వంశీయులు. గిగ్గుల్ల వంశానికి చెందిన రాజన్న, తదనంతరం లస్మన్న, ప్రస్తుతం ఆయన కొడుకు గుగ్గిల్ల స్వామి కుండలు తయారు చేస్తున్నాడు. మహా పూజలకు రెండు రోజుల ముందుగా మెస్రం వంశీయులు సిరికొండకు వచ్చి ఎడ్ల బండ్ల ద్వారా ఈ కుండలను తీసుకెళ్తారు.
తయారు చేసే కుండలివే..
రెండు కాగులు (పెద్ద కుండలు ), 16 బాణలు.. వీటికి 16 మూతలు, నీటి కుండలు 55.. వీటితోనే గంగాజాలాన్ని తీసుకొచ్చి నాగదేవతకు అభిషేకం చేస్తారు. 45 కడుముంతలు. వీటిని పూజలకు ఉపయోగిస్తారు. మట్టితో తయారు.చేసిన 150 దీపాలు. వీటిని నాగోబా ఆలయం చుట్టూ వెలిగించేందుకు ఉపయోగిస్తారు. 8 రొట్టె పెంకలు. వీటితో పూజకు వచ్చే మెస్రం వంశీయులు, వృద్ధులకు రొట్టెలు తయారు చేసి ప్రసాదంగా అందజేస్తారు. పూజల సమయంలో నాగోబా ఆలయానికి తీసుకెళ్లి ఘనంగా సన్మానిస్తారు. కాగా.. రాత్రి సమయంలో మర్రిచెట్ల వద్ద సంప్రదాయ వాయిద్యాలు, కిక్రి వాయిస్తూ నాగోబా చరిత్ర, సిరికొండ మట్టి కుండల పవిత్రత గురించి మెస్రం వంశీయులు పాటల ద్వారా వివరిస్తారు.
గిరిజన ఆదివాసుల ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరం నాగోబా జాతర సందర్భంగా ప్రత్యేక కుండలు తయారు చేసి అందించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. నాగోబా కోరిక మేరకు మేము తయారు చేసిన కుండలనే మెస్రం వంశీయులు ఉపయోగిస్తారు. మమ్మల్ని,మా సేవల్ని గుర్తించడం గర్వంగా ఉంది. ప్రతి సంవత్సరం జాతరలో మా వంశీయులను ఘనంగా సన్మానిస్తారు. నాగోబా దేవత మా వంశాన్ని చల్లగా చూస్తున్నది.