జిల్లాలో 25 బ్లాక్ స్పాట్ల గుర్తింపు
కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర
ఐరాడ్ పనితీరుపై అవగాహన
ఆసిఫాబాద్, ఆగస్టు 26: ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర అన్నారు. ఐరాడ్ పనితీరుపై జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీస్ అధికారులకు గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. జిల్లాలోని జాతీయ రహదారి, ఇతర రోడ్డు మార్గాల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయన్నారు. జిల్లాలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను కేంద్ర రవాణా,జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ గుర్తించి, నివారణ చర్యలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఐఐటీ మద్రాస్‌తో పాటు జాతీయ సమాచార కేంద్రం సంయుక్తంగా ఐరాడ్ ( ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డాటాబేస్)ను రూపొందించినట్లు చెప్పారు. ఐరాడ్పై జిల్లా పోలీస్ టెక్నికల్ టీంకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన టెలక్నికల్ టీం వర్టికల్ అధికారులకు శిక్షణ అందించినట్లు వివరించారు. జిల్లాలో 25 ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించినట్లు చెప్పారు. ఈ ఏడాది 102 రోడ్డు ప్రమాదాలు జరుగగా, 50 మంది దుర్మరణం చెందినట్లు వెల్లడించారు. ప్రమాదాల నివారణకు రేడియం స్టిక్కర్లు, బారీకేడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐటీ కోర్ టెక్నికల్ కానిస్టేబుల్ రాజేందర్, విజయాలాల్, శ్రీనివాస్ శిక్షణ ఇచ్చారు.