
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
అవల్పూర్లో రైతు వేదిక, సిర్సన్నలో రెడ్డి సంఘ భవనం ప్రారంభం
బేల, ఆగస్టు 26 : రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. బేల మండలంలోని అవల్పూర్ గ్రామంలో రైతు వేదిక భవనం, సిర్సాన్న గ్రామంలో రెడ్డి కుల సంఘ భవనాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతు బాగుండాలని, సంతోషంగా ఉండాలని కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో లేని పథకాలు అమలు చేసి దేశంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ అగ్రస్థానంలో నిలిచారని తెలిపారు. ప్రతి క్లస్టర్ వారీగా రూ.22 లక్షలతో రైతు వేదిక భవనాలు నిర్మించారన్నారు. రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా సీఎం కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రతి కుల సంఘం కోసం గ్రామాల్లో భవనాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగానే నేడు సిర్సన్న గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించిన రెడ్డి సంఘం భవనాన్ని ప్రా రంభించినట్లు తెలిపారు. బేల మండలంలో రూ.80 కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. అనంతరం అవల్పూర్ గ్రామంలో నిర్మించిన పూలాజీబాబా ధ్యాన మందిరాన్ని మండల నాయకులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కల్లేం ప్రమోద్ రెడ్డి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, నాయకులు మస్కే తేజ్రావ్, సతీశ్ పవార్, బాల్ చందర్, జితేందర్, కిషన్ వైద్య, సంతోష్ బెదుల్కర్ , సర్పంచ్ మినక పుష్పలత, మండల వ్యవసాయాధికారి విశ్వామిత్ర, ఏఈవోలు, ఆదిలాబాద్ జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు రాంరెడ్డి, సురేశ్ రెడ్డి, దీపక్ గౌడ్ , గంగన్న, ఆయా గ్రామాల రెడ్డి కులస్తులు పాల్గొన్నారు.