
నిర్మల్ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి
మామడ మండలం న్యూ సాంగ్విలో తనిఖీలు
మామడ, నవంబర్ 24 : నేరాలను నియంత్రించేందుకే కార్డన్‌సెర్చ్ నిర్వహిస్తున్నమని నిర్మల్ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు మండలంలోని న్యూసాంగ్వీ గ్రామ పంచాయతీలో బుధవారం కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. సోన్ సీఐ రాంనరసింహారెడ్డి, నిర్మల్ రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, ఆరుగురు ఎస్ఐలు, 55 మంది సిబ్బందితో ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు. సరైన వాహనపత్రాలు లేని 90 ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలు, రూ.12,430 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా బీమా, ఆర్సీ పత్రాలను కలిగి ఉండాలని పేర్కొన్నారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ప్రమాదం జరిగినప్పుడు అది ప్రాణాలను రక్షిస్తుందన్నారు. వాహనాలపై జరిమానాలుంటే ఎప్పటికప్పడు చెల్లించాలని తెలిపారు. ప్రజల రక్షణార్థమే కార్డన్‌సెర్చ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు నేరాల నియంత్రణపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి ప్రశాంత జీవితం గడపాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐలు అశోక్, వినయ్, రాణి పాల్గొన్నారు.
సైబర్ నేరాల అదుపులో విద్యార్థుల పాత్ర కీలకం
సారంగాపూర్, నవంబర్ 24: సైబర్ నేరాలను నియంత్రణలో విద్యార్థుల పాత్ర ఎంతో అవసరమని నిర్మల్ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని బోరిగాం పాఠశాలలో బుధవారం విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీ ఫోన్‌కి వచ్చే ఓటీపీ, మెయిల్‌కు, ఆధార్‌కార్డుకు సంబంధించిన ఓటీపీలు, ఇతర పాస్‌వర్డ్‌లను ఎవరికీ చెప్పకూడదన్నారు. ‘మా కంపెనీ చేపట్టిన డ్రాలో మీకు రూ.10 లక్షల నగదు బహుమతి వచ్చిందని, మీకు పంపించిన ఈ కింది లింక్‌ను క్లిక్ చేసి, మీ బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్ ఎంటర్ చేసి అమౌంట్ పొందగలరు’ లాంటి అనేక మెసేజ్‌లు వస్తూ ఉంటాయన్నారు. వాటిని క్లిక్ చేస్తే తమ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బంతా ఖాళీ అయిపోతుందని పేర్కొన్నారు. ఇలాంటి మెస్సేజ్‌లకు ఆశపడి అనవసరమై వాటిని క్లిక్ చేయకూదని తెలిపారు. ఈ విషయాలను తల్లిదండ్రులకు, బంధువులకు తెలియజేసి సైబర్ నేరాలను అరికట్టడానికి తమవంతు పాత్ర పోషించాలని సూచించారు. అనంతరం వీడీసీ, సర్పంచ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలను గ్రామ పంచాయతీలో ప్రారంభించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో నేరాలు, ఘోరాలు తగ్గుముఖం పడుతాయని పేర్కొన్నారు. అన్ని జీపీల్లో తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలు, దోపిడీలు తగ్గిపోతాయని తెలిపారు. కార్యక్రమంలో రూరల్ సీఐ వెంకటేశ్, ఎస్ఐ కృష్ణసాగర్రెడ్డి, సర్పంచ్ రాజారెడ్డి, ఆలూర్ పీఏసీఎస్ చైర్మన్ మాణిక్‌రెడ్డి, నాయకులు గణపతి, రాజ్‌కుమార్, విజయ్‌రెడ్డి, శ్రీకాంత్, పోలే రాజు, సాయేందర్, రాకేశ్, మోహన్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు.