
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సర్కారు కృషి
ఈ ఏడాది లక్ష్యం 2.23 కోటు
జిల్లాలో 371 చెరువుల్లో పెంపకం
ఇప్పటికే 50 లక్షలు విడుదల
మంచిర్యాల అర్బన్, నవంబర్ 23 ;కులవృత్తులకు ఆసరా కల్పించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఒక్కోటి దిగ్విజయంగా అమలవుతున్నాయి. ఇందులో భాగంగానే మత్స్యకారులను ఆదుకునేందుకు గతేడాదికంటే ఈ ఏడాది అదనంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. తద్వారా చేపల ఉత్పత్తులను గణనీయంగా పెంచి, మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపాలనేది ప్రభుత్వ ఆలోచన. రూపాయి పెట్టుబడి లేకుండా నీటి పారుదల, గ్రామ పంచాయతీ చెరువుల్లో కోట్లలో చేప పిల్లలను వదలనున్నది.
భారీ లక్ష్యంతో…
జిల్లాలో 93 సొసైటీల్లో 5902 మంది సభ్యులు ఉన్నారు. ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడమే కాకుండా ఉత్పత్తులను తిరిగి అమ్ముకునేందుకు వాహనాలు, మార్కెట్లో అమ్ముకునే వారికి టెంట్, తరాజు, ఐస్ బాక్సులు తదితరాలు అందజేసింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో వదిలే చేప పిల్లల లక్ష్యాన్ని భారీగా పెంచింది. గతేడాది 328 ట్యాంకుల్లో 193.535 లక్షల చేప పిల్లలను వదలగా, సుమారు 6500 టన్నుల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది 371 ట్యాంకుల్లో 223.855 లక్షల చేప పిల్లలను వదిలే లక్ష్యంగా ముందుకు సాగుతుండగా, సుమారు 6600 టన్నుల దిగుబడి వచ్చే అవకాశమున్నదని యంత్రాంగం అంచనా వేస్తున్నది.
371 చెరువుల్లో 2.23 కోట్ల చేప పిల్లలు..
జిల్లాలో 371 ట్యాంకుల్లో (జలవనరులు) 2 కోట్ల 23 లక్షల 85 వేల 500 చేప పిల్లలను వదలాలని మత్స్యశాఖ నిర్ణయించుకుంది. ఇందులో 363 ( గ్రామ పంచాయతీ ట్యాంకులు 250, 113 డిపార్టుమెంటు ట్యాంకులు) 35 నుంచి 40 మిల్లీ మీటర్ల పొడవు గల 124.275 లక్షల చేప పిల్లలు, ఎనిమిది రిజర్వాయర్లు, ప్రాజెక్టులలో 80 నుంచి 100 మిల్లీ మీటర్ల పొడవు గల 99.58 లక్షలు (ఎల్లంపల్లిలో 24.42 లక్షలు, సుందిల్ల బ్యారేజ్లో 22.80 లక్షలు, అన్నారం బ్యారేజ్లో 25.12 లక్షలు, గొల్లవాగులో 9.90 లక్షలు, నీల్వాయి వాగులో 9.96 లక్షలు, రాళ్లవాగులో 4.44 లక్షలు, పెద్దపేట పెద్ద చెరువులో 1.26 లక్షలు, నల్లవాగులో 1.68 లక్షల) చేప పిల్లలను వదలనున్నారు. మొత్తం 371 ట్యాంకుల్లో 223.855 లక్షల చేప పిల్లలను వదలడమే లక్ష్యంగా సంబంధిత శాఖ అధికారులు ముందుకు సాగుతున్నారు.
సకాలంలో లక్ష్యం పూర్తి చేస్తాం
తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల అభ్యున్నతి కోసం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. ఇప్పటికే 50 లక్షల పైచిలుకు పిల్లలను పోశాం. వరదల కారణంగా చేప పిల్లలను ఆలస్యంగా చెరువుల్లో వేయడం ప్రారంభించాం. ప్రాజెక్టులు, చెరువులన్నీ నీటితో నిండుగా ఉన్నాయి. ప్రభుత్వం ఏటా లక్ష్యాన్ని పెంచుతూ వస్తోంది. ఈ ఏడాది పెంచిన లక్ష్యాన్ని త్వరలోనే పూర్తి చేస్తాం.