
వినియోగదారుల విశ్వాసం చూరగొనాలి
డైరెక్టర్(ఆపరేషన్స్) చంద్రశేఖర్
సింగరేణి వ్యాప్తంగా జీఎంలతో వీసీలో సమీక్ష
శ్రీరాంపూర్, నవంబర్ 23 : బొగ్గు నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వినియోగదారుల విశ్వాసం చూరగొనాలని జీఎంలు, అధికారులకు డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్ చంద్రశేఖర్ ఆదేశించారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ నుంచి మంగళవారం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(కోల్ మూమెంట్) జే అల్విన్, జీఎం (కో ఆర్డినేషన్, మార్కెటింగ్) కే సూర్యనారాయణ, జీఎం (స్టాటజిక్ ప్లానింగ్) సురేందర్, డీజీఎంలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లుతో కలిసి అన్ని ఏరియాల జీఎంలు, ఓసీపీల పీవోలు, క్వాలిటీ జీఎంలతో బొగ్గు నాణ్యతా ప్రమాణాలు, సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. నాణ్యమైన బొగ్గు అందించే వారి వద్దకే వినియోగదారులు వెళ్తున్న దృష్ట్యా అన్ని గనుల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. గతానికి భిన్నంగా వినియోగదారులు నాణ్యత గల బొగ్గు స్వీకరించేందుకే ఆసక్తి చూపుతున్నారన్నారు. ఇదే సమయంలో విదేశీ బొగ్గు ధర కూడా తగ్గుతూ వస్తున్నదని తెలిపారు. స్వదేశీ బొగ్గులో నాణ్యత లోపం కారణంగా పలు పరిశ్రమలు విదేశీ బొగ్గు దిగుమతి చేసుకునే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. వినియోగదారులకు సరఫరా చేసే బొగ్గు నాణ్యతను నిర్ధారించేందుకు సంగరేణిలో ఇప్పటికే థర్డ్‌పార్టీ శాంప్లింగ్‌ను ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇవ్వాల్సిన గ్రేడు బొగ్గు కంటే ఒక్క గ్రేడు తగ్గినా ఇంధన సరఫరా ఒప్పందం ప్రకారం పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. కాబట్టి గని స్థాయి కార్మికుల నుంచి ఏరియా జీఎం స్థాయి వరకు ప్రతి ఒక్కరూ నాణ్యతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. గనుల వారీగా నాణ్యత పెంపునకు తీసుకుంటున్న చర్యలను ఏరియా అధికారులు వివరించారు. శ్రీరాంపూర్ నుంచి జీఎం ఎం సురేశ్, క్వాలిటీ డీవైజీఎం ఎన్ రమేశ్, పీవోలు పురుషోత్తంరెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, ఏజెంట్లు ఏవీ రెడ్డి, ఎంవీ నర్సింహారావు పాల్గొన్నారు.