
సిరికొండ,నవంబర్ 23 :ఎప్పుడూ ఒకే పంట సాగు చేసే రైతులు పంట మార్పిడితో మంచి ప్రయోజనాలు పొందవచ్చు. యాసంగి సీజన్లో వరి సాగు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఆరుతడి పంటల సాగు చేయాల్సిన అవసరం ఏర్పడింది. నేలసారాన్ని బట్టి అనువైన పంటలు వేసే దశగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. వేసిన పంటలే మళ్లీ వేస్తూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట మార్పిడి చేయకపోవడంతో చీడపీడల వ్యాప్తి ఎక్కువై దిగుబడి తగ్గుతుంది. ఒకరిని చూసి మరొకరు పంట మార్పిడి లేకుండా సాగు చేయడం జిల్లాలో అధికంగా కనిపిస్తోంది. పంట మార్పిడితో నేల భౌతికస్థితి మెరుగుపడడంతో పాటు భూమిలో నీరు నిల్వ ఉండే శక్తి కలిగి భూసారం వృద్ధి అవుతుంది. చీడపీడలు దూరం కావడంతో పాటు సస్యరక్షణకు వినియోగించే మందుల ఖర్చు తగ్గుతుంది. శిలీంధ్ర వ్యాధులను దూరం చేయడంతో పాటు బీజాలు, వాటి అవశేషాలు, వానపాముల అభివృద్ధి కూడా ఎక్కువగానే ఉంటుంది. కీటకాల గుడ్లు వృద్ధి చెందకుండా అడ్డుకోవచ్చు. పంటలో నాణ్యత పెరిగి గిట్టుబాటు ఎక్కువగా పొందవచ్చు.
ఆరుతడి పంటలతో మేలు
వరి తర్వాత పప్పు ధాన్యాలు,నూనెగింజలను పండించడం వల్ల వరి పంటను ఆశించే గ్రోవైరస్, దోమపోటును నివారించవచ్చు. జొన్న పంట సాగుచేసిన పొలంలో మిరప సాగు చేయవద్దు. వేరుశనగ సాగు చేసిన తర్వాత మళ్లీ అదే పంట వేసుకోరాదు. దీనివల్ల ఎర్ర గొంగలి పురుగు, శనగ పచ్చ పురుగు ఆశించవచ్చు. శనగ తర్వాత అముదంలో పంట మార్పిడి చేసుకోవచ్చు. నులి పురుగులు ఉన్న ప్రాం తాల్లో వంగ, బెండ, టమాట, ఉలవలు, మినుము, పెస ర, పంటలు వేస్తే అవి వాటిని మరింత అభివృద్ధి చేస్తారు.
రైతులు పాటించాల్సినవి
పంట మార్పిడిలో నేల ఉపరితలాన్ని పూర్తిగా కప్పే పంటలను ఎంపిక చేసుకోవాలి. శనగ, బబ్బెర, మినుము, ఉలవలు, పెసర పంటలు వేయడంతో నేలను కప్పి ఉంచుతాయి.కలుపు మొక్కలను నివారించవచ్చు. పత్తి పైరును మినుము,పెసర వంటి పంటతో మార్పిడి చేయడం వల్ల దోమ ఉధృతిని తగ్గించవచ్చు. వేరుశనగ తర్వాత జొన్న, మక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలు పండించాలి.
అవగాహన కల్పిస్తున్న అధికారులు
రాష్ట్రం ప్రభుత్వం యాసంగిలో వరి పంట వేయొద్దని, పంట మార్పిడి చేసుకోవాలని కోరడంతో వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. బంకమన్ను శాతం ఎక్కువగా ఉంటే ఎర్ర నేలలు,నల్లరేగడి నేలలు, పల్లపు ప్రాంతాల్లో పంట మార్పిడి చేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి.