సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
కౌటాల పీహెచ్సీలో సమావేశం
కౌటాల, ఆగస్టు 23 : పీహెచ్సీ వైద్య సిబ్బంది సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దవాఖాన అభివృద్ధి సొసైటీ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆసుపత్రిలో సౌకర్యాలను వైద్యాధికారి పల్లవిని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీటి సమస్య ఉందని, అదేవిధంగా సిబ్బందికి అదనపు గది అవసరమని, దవాఖానలో నెలకు 60 వరకు ప్రసవాలు చేస్తున్నామని, అయితే సిబ్బంది కొరత ఉందని కోనప్ప దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి అదనపు గది నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడంతో పాటు సిబ్బంది కొరత లేకుండా చూడాలని జిల్లా వైద్యాధికారికి సూచించగా త్వరలో సిబ్బందిని నియమిస్తామని ఆయన హామీనిచ్చారు. అదే విధంగా పలు పనులు చేపట్టేందుకు తీర్మానం చేశారు. అనంతరం పీహెచ్సీ ఆవరణలో ఉన్న 102 అంబులెన్స్‌ను పరిశీలించారు. త్వరలో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బెజ్జూర్ మండలానికి అంబులెన్స్‌ను అందిస్తానని హామీనిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనప్పకు వైద్యాధికారి పల్లవి రాఖీ కట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కుమ్రం మాంతయ్య, ఎంపీడీవో నస్రుల్లాఖాన్, తహసీల్దార్ మునావర్ షరీఫ్, కో ఆప్షన్ సభ్యుడు అజ్మత్ అలీ, సర్పంచ్ మౌనిశ్, ఉపసర్పంచ్ తిరుపతి, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు రవీందర్ గౌడ్, సంతోష్, శ్రీనివాస్, రాంచందర్, పవన్, రమేశ్, ప్రభాకర్ గౌడ్, బాపు, నాయకులు ఉన్నారు.
విద్యుత్ సమస్య లేకుండా చూస్తా..
విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బెజ్జూర్ మండలంలోని పోతెపల్లి, కోర్తెగూడ, కాటెపల్లి గ్రామాల నాయకులు మండల కేంద్రంలో ఎమ్మెల్యే కోనప్పను కోరారు. దీంతో వెంటనే ఏడీఈ రాజేశ్వర్‌తో మాట్లాడారు. సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.