
ఉమ్మడి జిల్లాలో మూడో రోజూ కొనసాగిన జ్వర సర్వే
అనూహ్య స్పందన.ఇంటింటికీ తిరుగుతున్న సిబ్బంది
పకడ్బందీగా పరీక్షలు..
ఎదులాపురం/నిర్మల్ చైన్‌గేట్/మంచిర్యాల ఏసీసీ, జనవరి 23 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటా జ్వర సర్వే మంచి ఫలితాలను ఇస్తున్నది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో కరోనా నియంత్రణకు సర్కారు వినూత్నంగా చేపట్టిన ఈ సర్వేపై కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసలు కురిపించింది. గతేడాది మే నెలలో చేపట్టిన ఈ సర్వే కారణంగా కరోనా వైరస్ బారిన పడిన వారిని ముందుగానే గుర్తించగలిగారు. దీంతో వారిని హోం ఐసొలేషన్‌కు త రలించి నిరంతరం పర్యవేక్షించారు. ఐసొలేషన్ కిట్‌లో ఐదు రోజులకు సరిపడా మందులు ఇచ్చారు. ఈ మందులు వాడి నా కరోనా తగ్గక పోతే దవాఖానల్లో చేర్పించి వైద్యం అందించారు. అలా గతేడాది సర్వే ఐదు విడుతలుగా కొనసాగింది. ఒక్కో విడుతకు కేసులు తగ్గుముఖం పట్టాయి. మొదటి విడుత మంచి ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈ యేడాది కూడా శుక్రవారం నుంచి మరో సారి జ్వర సర్వేను విస్తృతం చేశారు. ఇంటింటికీ తిరిగి పరీక్షలు నిర్వహిస్తున్న తీరుపై ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తున్నది.
ముందుగానే కరోనా కంట్రోల్..
కరోనా వైరస్ బారిన పడి ఇంటి నుంచి బయటకు వెళ్లలేని వారికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వే చాలా తోడ్పడింది. గతేడాది చేపట్టిన జ్వర సర్వేల్లో ఇలాంటి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. హోం ఐసొలేషన్‌లోనే ఉండి చికిత్స పొందిన వందలాది మంది కరోనా నుంచి విముక్తి పొందారు. జ్వర సర్వే ద్వారా ముందుగానే కరోనా లక్షణాలున్న వారిని గుర్తించగలిగారు. ఇలాంటి వారు క్వారంటైన్లో ఉండేలా చూడగలిగారు. దీంతో వైరస్ వ్యాప్తిని అరికట్టగలిగారు. ముఖ్యంగా రెండో విడుతలో తీవ్ర స్థాయి లో విజృంభించిన కరోనా జ్వర సర్వే కారణంగానే అదుపులోకి వచ్చింది. మూడో విడుత కూడా కరోనా ఉధృతం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి జ్వర సర్వేను విస్తృతం చేయడంతో మంచి ఫలితాలు వస్తాయనే అభిప్రా యం సర్వత్రా వినిపిస్తున్నాయి.