
కోటపల్లి, జనవరి 19 : అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతి పనులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శేషాద్రి సూచించారు. కోటపల్లి, మల్లంపేట, కొండంపేట గ్రామాల్లోని నర్సరీలను డీఆర్డీవో పరిశీలించి సూచనలు చేశారు. హరితహారానికి మొక్కలు సిద్ధం చేయాలని, నర్సరీలను ప్రతి రోజూ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించాలని సూచించారు. కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అనంతరం గ్రామాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. 15 నుంచి 18 ఏళ్ల వయస్సు గల వారికి వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కొలిపాక భాస్కర్, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలి
-అడిషనల్ డీఆర్డీవో దత్తారావు
హాజీపూర్, జనవరి 18 : ప్రతి గ్రామ పంచాయతీలో జాతీయ ఉపాధి హామీ పనుల్లో ప్రతి రోజూ కూలీల సంఖ్య అధికంగా ఉండేలా చూడాలని అడిషనల్ డీఆర్డీవో దత్తారావు అన్నారు. బుధవారం మండలంలోని మండల ప్రజా పరిషత్ (ఎంపీడీవో) కార్యాలయంలోని సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులకు, ఈజీఎస్ సిబ్బందికి ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అడిషనల్ డీఆర్డీవో మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్న జాతీయ ఉపాధి హామీపనుల్లో ప్రతి రోజూ 50 మంది కూలీలకు పైగా పనులకు హాజరయ్యేలా చూడాలన్నారు. ప్రతి కూలీకీ వంద రోజుల పని కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని దానికి అనుగుణంగా కూలీల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. పలు అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) అబ్దుల్ హై, ఈజీఎస్ ఏపీవో మల్లయ్య, శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.