
నేడు ఇందిరా పార్క్ వద్ద సర్కారు మహాధర్నా
యాసంగి వడ్ల కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి తరలిన మంత్రి, విప్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు
దిగివచ్చే వరకూ వదిలిపెట్టబోమంటూ స్పష్టం చేసిన ప్రజాప్రతినిధులు
నిర్మల్ టౌన్/ఆదిలాబాద్ రూరల్,నవంబర్ 17 : తెలంగాణ రైతులకు అండగా రాష్ట్ర సర్కారు కేంద్రంపై యుద్ధానికి సై అంది. యాసంగి ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేడు హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు దిగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆందోళన చేపట్టనుండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, విప్ సుమన్‌తో పాటు ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు తరలివెళ్లారు. ధాన్యం కొంటరా.. కొనరా..? అన్న విషయం తేల్చాలని,ద్వంద్వ వైఖరితో కర్షకులను మోసం చేయాలని చూస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు.
అన్నదాతకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రంపై ప్రత్యక్ష యుద్ధానికి సన్నద్ధమయ్యింది. యాసంగి వడ్ల కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చే స్తూ నేడు ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిరసనలు చేపట్టనుండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రి, విప్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు.
మంచిర్యాల జిల్లా నుంచి..
మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, విప్ బాల్క సుమన్, దుర్గం చిన్నయ్యతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఎంపీ వెంకటేశ్ నేతకాని, జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో పాటు రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మోట పల్కుల గురువయ్య, సహకార బ్యాంక్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్యమైన నాయకులు, తదితరులు పాల్గొననున్నారు. ధర్నా అనంతరం నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు వినతిపత్రం అందజేయనున్నారు. కేంద్రం ఒకటి చెప్పి, బీజేపీ రాష్ట్ర నాయకులు మరోలా చెబితే ప్రజాక్షేత్రంలో రైతులు నిలదీస్తారని వారు పేర్కొన్నారు. రైతులపై బీజేపీ నాయకుల దాడి హేయమన్నారు.
ఆసిఫాబాద్ జిల్లా నుంచి..
ఆసిఫాబాద్ జిల్లా నుంచి జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో జిల్లా నుంచి సుమారు 200 మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలు తరలివెళ్తున్నారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్యకార్యకర్తలు, నాయకులు జిల్లా నుంచి ధర్నాలో పాల్గొననున్నారు. సిర్పూర్ నియోజకవర్గం నుంచి వంద మంది, ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి వంద మంది మహా ధర్నాలో పాల్గొననున్నట్లు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు కోవ లక్ష్మి తెలిపారు.
నిర్మల్ జిల్లా నుంచి మంత్రి అల్లోల..
నిర్మల్ జిల్లా నుంచి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వీ.సత్యనారాయణగౌడ్, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ వెంకట్రామ్రెడ్డి, టీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరిరావు, టీఆర్ఎస్ మండలాల కన్వీనర్లు, ముఖ్య నేతలు హైదరాబాద్‌కు తరలివెళ్లనున్నారు. నిర్మల్ నియోజకవర్గం నుంచి 25 మంది ప్రజాప్రతినిధులు ఈ ధర్నాకు వెళ్తున్నట్లు పార్టీ నాయకులు పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా నుంచి..
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ఆధ్వర్యంలో జిల్లా నుంచి టీఆర్ఎస్ గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధులు బుధవారం సాయంత్రం హైదారబాద్ చేరుకున్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న ధర్నా ప్రాంతానికి చేరుకుని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావ్ను కలిశారు. అనంతరం అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా నాయకులకు దిశానిర్ధేశం చేశారు.
స్పష్టత ఇచ్చేదాకా వెంటాడుతం
వడ్ల కొనుగోలుపై కేంద్రం స్పష్టత ఇచ్చేదాకా వదిలిపెట్టం. అన్ని వేదికలపైనా బీజేపీని వెంటాడుతం. రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ వారి కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ఎన్ని పోరాటా లకైనా సిద్ధం. మొన్న నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా చేసినం. ఇప్పుడు రాష్ట్ర రాజధానిలో చేస్తున్నం. రైతుల జోలికి వచ్చినా, రైతులకు నష్టం చేసినా చూస్తూ ఊరుకోం. తీరు మారకుంటే పోరాటాలు కొనసాగిస్తం.
-బాల్క సుమన్, ప్రభుత్వ విప్
ధాన్యం కొనే వరకూ వదిలిపెట్టం
కేంద్రం యాసంగి వరి ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ధర్నాలో పాల్గొనేందుకు జిల్లా నుంచి ముఖ్య కార్యకర్తలు, నాయకులతో కలిసి తరలివెళ్తున్నాం. మన ముఖ్యమంత్రి రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతులను ఇబ్బందులకు గురిచేసేలా ప్రవర్తిస్తోంది. ఇది ఏమాత్రం సరికాదు. తెలంగాణలో రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కొనేదాకా ఆందోళలు చేపడుతాం. యావత్తు తెలంగాణ ప్రజలు, రైతులు ముఖ్యమంత్రి వెన్నంటి ఉన్నారు.
– కోవ లక్ష్మి, జడ్పీ చైర్పర్సన్, ఆసిఫాబాద్
కేంద్రం చేతులెత్తేస్తున్నది
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం చేతులెత్తేస్తున్నది. రైతుల ప్రయోజనాలను ఏమాత్రం పట్టించు కోవడంలేదు. ఇబ్బంది కలుగవద్దనే ప్రత్యా మ్నాయ పంటలు వేయాలని వ్యవసాయ శాఖ అన్నదాత లకు సూచించింది. వరి కొనబోమని కేంద్రం, వరి పంటనే వేయండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నరు. ధాన్యం కొనుగోళ్లపై క్లారిటీ ఇచ్చేదాకా రైతుల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తం. బీజేపీ నేతల దుర్మార్గాన్ని ఎక్కడికక్కడ ప్రజలకు వివరిస్తాం. –దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి ఎమ్మెల్యే