
సాత్నాల, మత్తడి వాగు ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు ప్రణాళికలు
మూడు విడుతల్లో 50 రోజుల పాటు సరఫరా
32,500 ఎకరాలకు అందించేందుకు సిద్ధం
ఆయకట్టు రైతుల్లో హర్షం
ఆదిలాబాద్, నవంబర్ 17 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలతో యాసంగి సాగుకు ఢోకా లేకుంటైంది. సాత్నాల, మత్తడి వాగు ప్రాజెక్టులు నిండుకోగా, పంటలకు నీరు సరఫరా చేసేందుకు యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి మూడు విడుతల్లో 50 రోజుల పాటు విడుదల చేయనున్నది. మొత్తంగా 32,500 ఎకరాలకు నీరందనుండగా, ఆయకట్టు రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
ఆదిలాబాద్ జిల్లాలో వానకాలంలో సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు బాగా పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతంకంటే ఎక్కువ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సీజన్లో 1117.7 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండ గా, 1652.1 మిల్లీ మీటర్ల వర్షం పడింది. ఫలితంగా ప్రాజెక్టులతో పాటు చెరువుల్లోకి నీరు పుష్కలంగా చేరింది. జిల్లాలోని సాత్నాల, మత్తడి ప్రాజెక్టులు సైతం గరిష్ట నీటిమట్టానికి చేరుకోవడంతో అధికారులు గేట్లు ఎత్తి కాలువల ద్వారా నీటిని బయటకు వదిలారు. సాత్నాల ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 286.50 మీటర్లు కాగా, ప్రస్తుతం 285.90 మీటర్ల వరకు నీరు చేరింది. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 1.240 టీఏంసీలు కాగా, 1.091 టీఎంసీల నీరు చేరింది. మత్తడి ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 277.50 మీటర్లు కాగా, 277.50 మేర నీరు నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 0.571 టీఎంసీలు కాగా, పూర్తిస్థాయి నీరు నిల్వ ఉంది. వానకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి వచ్చిన వర్షం నీటితో ప్రాజెక్టులు గరిష్ఠ నీటిమట్టానికి చేరుకోగా, అధికారులు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని బయటకు వదిలారు.
సాత్నాలకు మరమ్మతులు
సాత్నాల ప్రాజెక్టు కింద 24 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, గతంలో 14 వేల ఎకరాలకు మాత్రమే నీరు అందేది. ప్రభుత్వం రూ.28 కోట్లతో ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టింది. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో లక్ష్మీపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని సైతం పెంచారు. గతంలో లక్ష్మీపూర్ రిజర్వాయర్ కింద పంటలకు కాలువ ద్వారా నీరు విడుదల చేసినా.. చివరి ఆయకట్టు వరకు అందేది కాదు. కాలువల లీకేజీలు, మిగతా నిర్మాణాలు సరిగా లేకపోవడంతో నీరంతా వృథాగా పోయేది. దీంతో సగానికిపైగా ఆయకట్టు రైతుల భూములకు నీరురాక పంటలు నష్టపోయేవారు. ప్రభుత్వం కాలువల మరమ్మతులు లైనింగ్, వాల్స్, డ్రాప్‌లు, తూముల మరమ్మతులు పూర్తి చేయడంతో ప్రస్తుతం చివరి ఆయకట్టు వరకూ నీరు అందుతున్నది. ఎడమ కాలువ ద్వారా ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్‌గూడ, పార్టీ, రామాయి, అనుకుంట, జైనథ్ మాం గూర్ల, సుందరగిరి, సాత్నాల గ్రామాల్లోని 4 వేల ఎరాలు, కుడి కాలువ ద్వారా జైనథ్ మండలం మేడిగూడ, కంఠం, పార్డీ(బీ), పార్డీ (కే), ఆడ, ముక్తాపూర్, నీరాల, లక్ష్మీపూర్, జైనథ్, బాలాపూర్, తరోడ, సావాపూర్, ఆకు ర్ల, దీపాయిగూడ, ఆనందపూర్, కూర, కాప్రీ, బెల్లూరి, మాకోడ,బెల్గం, ఉమ్మి, కరంజి, లేకర్వాడ, పెండల్వాడ, కౌఠ, సాంగ్వి గ్రామాల్లోని 20 వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నది.
32,500 ఎకరాలకు సాగు నీరు
సాత్నాల, మత్తడి ప్రాజెక్టుల కింద యాసంగిలో 32,500 ఎకరాలకు సాగు నీరు అందనున్నది. సాత్నాల ప్రాజెక్టు నుంచి ఆయకట్టు 24 వేల ఎకరాలు కాగా, మత్తడి ప్రాజెక్టు కింద 8500 ఎకరాలకు కాలువల ద్వారా అధికారులు నీటిని అందించనున్నారు. సాత్నాల, మత్తడి వాగు ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు విడుతల వారీగా నీటిని విడుదల చేస్తారు. ఈ నెల 7 నుంచి 27 వరకు మొదటి విడుత.. డిసెంబర్ 12 నుంచి 26వ తేదీ వరకు రెండో విడుత, జనవరి 11 నుంచి 25వ తేదీ వరకు మూడో విడుత విడుదల చేస్తారు. రెండు ప్రాజెక్టుల నుంచి మొదటి విడుతలో 20 రోజులు, రెండో విడుతలో 15 రోజులు, మూడో విడుతలో 15 రోజుల పాటు యాసంగి పంటలకు అధికారులు 50 రోజులు నీటిని విడుదల చేస్తారు.
యాసంగిలో శనగ వేసిన
తాంసి, నవంబర్ 17 : సాత్నాల ప్రాజెక్టు కాలువల ద్వారా నీరు అందుతున్నది. ఏటా రెండు పంటలు తీస్తున్నం. నాకు 2.20 ఎకరాల భూమి ఉంది. సోయా పంట తర్వాత యాసంగిలో శనగ వేసుకున్న. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సాత్నాల ప్రాజెక్టు కాలువలకు మరమ్మతులు చేశారు. ఇప్పుడు చివరి ఆయకట్టు వరకూ సాగు నీరు అందుతున్నది.
రెండు పంటలూ వేసుకుంటున్నం..
తాంసి, నవంబర్ 17 : నాకు మా ఊరిలో 5 ఎకరాల భూమి ఉంది. ఖరీఫ్‌లో సోయాబీన్ వేసిన. ఇప్పుడు యాసంగిలో శనగ వేసిన. శనగ విత్తనాలు మంచిగ మొలిసినయ్. సాత్నాల కాలువల ద్వారా సాగు నీరువస్తోంది. ఏటా రెండు పంటలు పండించుకుంటున్నం. మంచిదిగుబడి కూడా వస్తోంది.
-మ్యాకల వెంకన్న, రైతు, కూర