
సీసీఎస్ సీఐ చంద్రమౌళి
మానవ అక్రమ రవాణా, షీటీంలపై అవగాహన
ఎదులాపురం, నవంబర్ 17 : ప్రస్తుత సమాజంలో మహిళలను ఎవరైనా వేధిస్తే నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సీసీఎస్ సీఐ ఈ చంద్రమౌళి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మానవ అక్రమ రవాణా నివారణ, షీటీంలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మానవ అక్రమ రవాణాకు గురువుతున్న బాధితుల్లో మహిళలు, చిన్నపిల్లలు ఉంటున్నారని తెలిపారు. జాతీయ నేర రికార్డుల బ్యూరో ప్రకారం చాకిరి, మహిళల చేత బలవంతంగా వ్యభిచారం చేయించడం, లైంగిక వేధింపులకు పాల్పడడం, బలవంతపు పెళ్లిళ్లు భిక్షాటన , మానవ అవయవాల తొలగింపు, తదితర అనేక నేరాలకు గురువుతున్న బాధితులను రక్షించడానికే రాష్ట్రంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ స్థాపితమైందన్నారు. జిల్లాలో మావన అక్రమ రవాణా నిర్మూలనకు బృందం సభ్యులు బాధితులను గుర్తించి రక్షించే కార్యక్రమం చేపడుతుందని తెలిపారు. వేధింపులకు గురైన బాధితులు వెంటనే డయల్ 100కు లేదా 9440900635కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఐ సయ్యద్ తాజుద్దీన్, హెడ్ కానిస్టేబుళ్లు దారట్ల శోభన్, రమేశ్ కుమార్, కానిస్టేబుళ్లు ఠాకూర్ జగన్సింగ్, హనుమంతరావు, కేజీబీవీఎస్వో దీప్తి పాల్గొన్నారు.