తలమడుగు, జనవరి 17 : పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మండలంలోని కుచులపూర్ జీపీ పాలకవర్గం సద్వినియోగం చేసుకుంటున్నది. సీఎం కేసీఆర్ పల్లెలను అందంగా తీర్చిదిద్దేందుకు పెద్ద పీట వేస్తున్న తరుణంలో ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ఉపయోగించుకుంటూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నది. గ్రామాభివృద్ధి కమిటీ సహకారంతో ఆదర్శ పంచాయతీగా గుర్తింపు తెచ్చుకున్నది. గ్రామంలో దాదాపు రూ.1.20 కోట్లతో వివిధ రకాల పనులు చేపట్టారు. రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, హరితహారం, శ్మశాన వాటిక, డంప్ యార్డు, కమ్యూనిట్ హాల్ నిర్మించారు.
కుచులపూర్‌లో 900 కుటుంబాలు, 3400 జనాభా, 2300 మందికి ఓటర్లు ఉన్నారు. ఉపాధి హామీ ద్వారా రూ.14.50 లక్షలతో శ్మశాన వాటిక, రూ.2.50 లక్షలతో సెగ్రి గేషన్ షెడ్డు నిర్మించారు. పంచాయతీ పరిధిలో రెండు పల్లె ప్రకృతి వనాలను రూ.6.50 లక్షలతో ఏర్పాటు చేశారు. రూ.22 లక్షలతో సుందరంగా రైతు వేదిక నిర్మించారు. గ్రామ పంచాయతీ నిధులు రూ. 30 లక్షల వ్యయంతో గ్రామంలో సీసీ రోడ్లు, రూ. 8లక్షల వ్యయంతో మురికి కాలువలు నిర్మించారు. గ్రామానికి రెండేళ్ల క్రితం క్రితం హైకోర్టు జడ్జి రావడంతో న్యాయ శాఖ ద్వారా గ్రామంలో రూ.14 లక్షల సీసీ రోడ్డుతో పాటు రూ.2 లక్షల వ్యయం తో లైబ్రరీ ఏర్పాటు చేశారు. పంచాయతీ నిధులు రూ.9 లక్షలతో ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్ కొనుగోలు చేశారు. రూ.5 లక్షలు ఎమ్మెల్యే నిధులతో సవారి బంగ్లా కమ్యూనిటీ హాల్‌తో పాటు, గ్రామ అభివృద్ధి కమిటీ ద్వారా గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు.
రోడ్లు ఇరువైపులా మొక్కలు..
కుచులాపూర్ నుంచి ఎక్స్‌రోడ్డు వరకు ఇరువైపులా నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దీంతో మొక్కలు ఏపుగా పెరిగి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. పల్లె ప్రకృతి వనాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేయడంతో సాయంత్రం పూట వృద్ధులు, చిన్నారులతో పార్కు నిత్యం సందడిగా కనిపిస్తున్నది. నర్సరీ ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. పంచాయతీ ట్రాక్టర్ ద్వారా ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను సేకరించి డంప్ యార్డుకు తరలిస్తున్నారు.
అందరి సహకారంతో…
గ్రామస్తులు, అధికారులు, పాలకవర్గ సభ్యుల సహకారంతో పంచాయతీ భివృద్ధి సాధ్యమవుతున్నది. దాదాపు రూ.1.20 కోట్లతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టాం. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నాం. ఎమ్మెల్యే, ఎంపీపీ, గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి సాధిస్తున్నాం. అందరి సహకారంతో గ్రామాన్ని మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటాం.
మోహిత ప్రభ, సర్పంచ్ కుచులాపూర్