
నేడు, రేపు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె
బీజేపీ ప్రభుత్వ విధానాలపై ఉద్యోగ జేఏసీ పోరాటం
కుట్రలను ఆపేవరకు పోరాటం చేస్తామని ప్రకటన
నిర్మల్ టౌన్, డిసెంబర్ 15 : దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు పావులు కదుపుతున్నది. ఇప్పటికే దేశంలో అనేక ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేయగా.. ఇప్పుడు బ్యాంకుల ను కూడా ఆ జాబితాలో చేర్చింది. అమిట్మెంట్-2021 (సవరణ) బిల్లులు తేవడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్(జేఏసీ) ఆధ్వర్యంలో గురు, శుక్రవారాల్లో ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వివిధ బ్యాంకులకు చెందిన మొత్తం 300 పైగా శాఖలున్నాయి. ఇందులో ఆరువేల మందికిపైగా పనిచేస్తున్నారు. వీరంతా ఈ సమ్మెలో పాల్గొననున్నారు. ఇప్పటికే సింగరేణి బొగ్గు, బీహెచ్ఈఎల్, ఎల్ఐసీ, తదితర సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు చర్యలు తీసుకోగా.. ఉద్యోగులు పోరాడినా కేంద్రం ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బ్యాంకు అమిట్మెంట్ బిల్లును తీసుకొచ్చేలా కుట్రలు చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.
బిల్లుతో అన్ని విధాలా నష్టమే..
కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను జాతీయ విలీనం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు పెద్ద ఎత్తున ప్రభుత్వరంగ బ్యాంకులను జాతీయకరణ చేయడంతో మంచి సేవలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాల్లో సైతం బ్యాంకులు ఏర్పడ్డాయి. ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలతో పాటు రుణాలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో కార్పొరేట్‌ను ప్రోత్సాహిస్తూ ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తున్నది. ఈ బిల్లు అమలైతే ప్రజల సొమ్ము భద్రతకు నష్టం కలుగుతుంది. ప్రస్తుతం జీరో జన్‌ధన్ ఖాతాలు, సబ్సిడీ రుణాలు, సబ్సిడీ గ్యాస్, గృహ, వ్యాపార రుణాలు, కిడ్డీ బ్యాంకుల ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలందుతాయి. అదే ప్రైవేటీకరణ చేస్తే సామాన్య జనానికి ఈ సేవలు అందకుండా పోతాయి. కార్పొరేట్ సంస్థలకు ప్రైవేట్ బ్యాంకులు రుణాలిచ్చేందుకు ముందుకు వస్తాయి. ఒకవేళ నష్టపోయినా, రుణాలు తీసుకొని ఎగ్గొట్టినా ప్రభుత్వానికి సంబంధముండదు. అదే ప్రభుత్వ ఆధీనంలో ఉంటే బ్యాంకు దివాళా తీస్తే వినియోగదారులకు సొమ్ము చెల్లించే అవకాశం ఉంటుంది. ఈ బిల్లుతో భవిష్యత్‌లో బ్యాంకుల సంఖ్య తగ్గిపోయి ఉద్యోగులకు భద్రత కూడా కరువయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యాంకు జేఏసీ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల నుంచి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె బాట పడుతున్నారు. ఇందులో మొత్తం 12 యూనియన్లు పాల్గొంటున్నట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు పేర్కొంటున్నారు.
సబ్సిడీ పథకాలకు మంగళం..
బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడంతో ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ, సబ్సిడీ పథకాలకు చెక్పడే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు పెద్దఎత్తున అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఇందులో రైతుబంధు, జీరో జన్‌ధన్ ఖాతా, సబ్సిడీ రుణాలు జాతీయ బ్యాంకులు మాత్రమే గ్రామీణ ప్రజలకు అందిస్తున్నాయి. కార్పొరేట్ బ్యాంకులు మాత్రం పెద్ద పెద్ద సంస్థలకు రుణాలిచ్చేందుకు ముందుకు వస్తాయి. దీనివల్ల గ్రామీణ ప్రాంతాలకు తీరని నష్టం జరుగుతుంది.