
తలమడుగు ఎంపీడీవో రమాకాంత్
వ్యాక్సినేషన్ కేంద్రాలు పరిశీలన
తలమడుగు, డిసెంబర్ 15: మొదటి, రెండు డోసులు ప్రతి ఒక్కరూ వేసుకుంటేనే కరోనా దూరమవుతుందని ఎంపీడీవో రమాకాంత్ అన్నారు. మండలంలోని బరంపూర్, దేవాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను బుధవారం ఆయన పరిశీలించారు. గ్రామస్తులు వైద్య సిబ్బందికి సహకరించి టీకా వేయించుకోవాలని సూచించారు. అనంతరం గ్రామాల్లోని నర్సరీలను పరిశీలించారు. మొక్కల పెంపకాన్ని వేగవంతం చేయాలని ఈజీఎస్ సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఏపీవో శ్యాముల్, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
నార్నూర్, డిసెంబర్ 15 : కొత్తపల్లి(హెచ్) గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని మండల ప్రజా పరిషత్ సూపరింటెండెంట్ గంగాసింగ్ పరిశీలించారు. వ్యాక్సిన్ తీరును వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆరోగ్య పర్యవేక్షకుడు జవహర్, సిబ్బంది ఉన్నారు.
భీంపూర్, డిసెంబర్ 15: కరణ్‌వాడి గ్రామంలో వ్యాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. 110 మందికి టీకాలు వేశామని ఏఎన్ఎం సుజాత తెలిపారు. సర్పంచ్ నీతాబాయి, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.
వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం చేయాలి
బేల, డిసెంబర్ 15: వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఐకేపీ ఏపీఎం కిరణ్ కుమార్ అన్నారు. మండల కేంద్రంతో పాటు సైద్పూర్, దైన, పాలయితండా గ్రామాల్లో కొవిడ్ టీకా శిబిరం ఏర్పాటు చేశారు. కొవిడ్ టీకాపై అపోహలు వీడి వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. సూపర్వైజర్ రాజమణి, ఏఎన్ఎం లలిత, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.
సిరికొండ, డిసెంబర్ 15 : సుండికి గ్రామంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎంపీడీవో సురేశ్ పరిశీలించారు. ప్రజలకు వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ అనిత, పంచాయతీ కార్యదర్శి అరుణ్, వైద్యసిబ్బంది సుశీల, గంగాధర్ పాల్గొన్నారు.
వ్యాక్సిన్‌తోనే మూడోవేవ్ తగ్గుతుంది
ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 15 : 18 సంవత్సరాలు నిండిన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారానే మూడోవేవ్ ముప్పు తగ్గుతుందని ఖుర్షీద్ నగర్ పీహెచ్సీ వైద్యాధికారి శిల్ప అన్నారు. జిల్లా కేంద్రంలోని రణదీవేనగర్‌లో శిబిరం నిర్వహించారు. మొదటి, రెండో డోసు టీకా వేశారు. మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో మహిత స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ ఇమ్రాన్, వ్యాక్సినేటర్ సమత, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.