
తెలంగాణ గ్రామీణ బ్యాంకు జీఎం కేవీ ప్రసాద్
40 ఏళ్ల తర్వాత బ్యాంకు ప్రారంభించడంపై మండల కేంద్రం ప్రజల హర్షం
వేమనపల్లి, డిసెంబర్ 15 : గ్రామీణ బ్యాంకు సేవలను వేమనపల్లిప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గ్రామీణ బ్యాంకు రాష్ట్ర జనరల్ మేనేజర్ కేవీ ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం వేమనపల్లి మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖను మంచిర్యాల జిల్లా ఆర్ఎం చంద్రశేఖర్‌రెడ్డి, వేమనపల్లి బ్యాంకు మేనేజర్ చరణ్, ఎంపీపీ కోలి స్వర్ణలత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోలి వేణుమాధవ్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం కేవీ ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా ప్రజలు బ్యాంకు లేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. నీల్వాయిలో గ్రామీణ బ్యాంకు ఉన్నప్పటికీ ఖాతాదారులు పెద్ద సంఖ్యలో ఉండడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వేమనపల్లి మండల కేంద్రంలో బ్యాంకును ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ బ్యాంకు సుమారు 14 గ్రామ పంచాయతీల ప్రజలకు సేవలందిస్తుందని వెల్లడించారు. బ్యాంకు ద్వారా రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించాలని సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ బ్యాంకు భవన నిర్మాత దాత కోలి వేణుమాధవ్‌రావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి బ్యాంకు లేకపోవడంతో మండల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. అధికారులు స్పందించి బ్యాంకు ఏర్పాటు చేయడం సంతోషం ఉందన్నారు. బ్యాంకు ఏర్పాటుకు కృషి చేసిన ఎంపీపీ కోలి స్వర్ణలత, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కోలి వేణుమాధవ్‌ను బ్యాంకు అధికారులు సన్మానించారు. అనంతరం డ్వాక్రా గ్రూపు సభ్యులకు రూ. 10 లక్షల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పురాణం లక్ష్మీకాంత్, బ్యాంకు క్యాషీయర్ పవన్, సర్పంచ్ కుబిడె మధూకర్, వైస్ ఎంపీపీ ఆత్రం గణపతి, మాజీ ఎంపీపీ లింగాగౌడ్, వెంకటేశం, కో ఆప్షన్ సభ్యుడు ముజ్జు ,బ్యాంకు సిబ్బంది, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
40 ఏళ్ల తర్వాత బ్యాంకు సేవలపై ప్రారంభంపై హర్షం
నక్సలైట్ల ప్రభావంతో 40 సంవత్సరాల క్రితం వేమనపల్లి మండల కేంద్రం నుంచి కోటపల్లికి గ్రామీణ బ్యాంకును అధికారులు తరలించారు. ఇన్ని ఏళ్ల తర్వా మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేయడంపై మండల ప్రజలు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు.