
వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలి
డీఎల్పీవో ప్రభాకర్ రావు
కోటపల్లి, డిసెంబర్ 15 : పల్లె ప్రగతి పనులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు డీఎల్పీవో ప్రభాకర్ రావు సూచించారు. కోటపల్లి మండలంలోని సిర్స గ్రామ పంచాయతీని డీఎల్పీవో ప్రభాకర్‌రావు బుధవారం సందర్శించారు. పల్లె ప్రకృతి వనాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. నర్సరీలో మొక్కల పెంపకంపై దృష్టి పెట్టాలని, ప్రతి రోజూ పర్యవేక్షించాలన్నారు. పండ్ల మొక్కలతో పాటు నీడనిచ్చే మొక్కలను పెంచాలన్నారు. ప్రతి రోజూ పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలని, హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించాలన్నారు. 100 శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో ముల్కల్ల సత్యనారాయణ రెడ్డి, సర్పంచ్ పెద్దింటి పున్నంచంద్, పంచాయతీ కార్యదర్శి సరిగమపదనిసల సదయ్య, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
మండల ప్రగతిపై సమీక్ష
కోటపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ప్రగతిపై పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బందితోఎంపీడీవో కే భాస్కర్ సమీక్షించారు. పారిశుధ్య నిర్వహణ, మొక్కల సంరక్షణ తదితర విషయాలపై పంచాయతీ కార్యదర్శులకు సూచనలు చేశారు. ఉపాధి పనుల్లో కూలీల సంఖ్య పెంచి ప్రతి కుటుంబానికీ వంద రోజులు పని కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
కార్యదర్శులతో సమావేశం
జైపూర్, డిసెంబర్ 15: జైపూర్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కార్యదర్శులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉపాధిహామీ పనులు, నర్సరీల్లో మొక్కల పెంపకం పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని సూచించారు. గ్రామాల్లో వ్యాక్సినేషన్‌పై నిర్వహించిన సర్వే ప్రకారం ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి రోజూ పారిశుధ్య పనులు నిర్వహించాలని సూచించారు. ఆర్థిక సంవత్సరం సమీపిస్తున్నందున గ్రామాల్లో పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎ ంపీవో సతీశ్‌కుమార్, ఏపీవో బాలయ్య తదితరులున్నారు.